పార్సిల్​లో ఇంటికి డెడ్​ బాడీ.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన

  • రూ.1.30 లక్షలు చెల్లించాలనిమృతదేహంతో పాటు లేఖ
  • రెండురోజులుగా చిన్నల్లుడు కనిపించట్లేదని ఫ్యామిలీ టెన్షన్​

యండగండి: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో పార్సిల్​లో డెడ్​బాడీ రావడం కలకలం సృష్టించింది. పార్సిల్ రిసీవ్ చేసుకున్న మహిళ భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉండి మండలం యండగండిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాగి తులసి ఒంటరి మహిళ. ఆమె భర్త సాగి శ్రీనివాస రాజు పదేండ్ల కింద ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఇంత వరకు ఆయన జాడ లేదు. గతంలో ఆమెకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టింది.

క్షత్రియ కులానికి చెందిన ఆమె ఆర్థిక సాయం కోసం సెప్టెంబర్​లో క్షత్రియ ఫౌండేషన్​కు దరఖాస్తు చేసుకున్నారు. కొద్ద రోజుల కింద ఆ ఫౌండేషన్ నుంచి టైల్స్, ఇంటికి వేసుకోవడానకి పెయింట్స్ పంపించారు. ఇంటికి అవసరమైన వైరింగ్, ఎలక్ట్రికల్ వస్తువులు పంపిస్తున్నమని గురువారం ఆమెకు మెసేజ్ వచ్చింది. గురువారం రాత్రి పొద్దుపోయాక తులసి ఇంటికి ఆటోలో ఒక పార్సిల్ వచ్చింది. దాన్ని రిసీవ్​చేసుకన్న ఆమె ఓపెన్ చేసి చూడగా డెడ్ బాడీ కనిపించింది.

భయపడిపోయిన ఆమె వెంటనే కాలనీ వాసులకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. పార్సిల్​లో డెడ్​బాడీతో పాటు ఒక లెటర్ కూడా ఉంది. అందులో ఆమె భర్త 2008లో రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నాడని.. ఇప్పుడు ఆ మొత్తం రూ.1.30 కోట్లు అయిందని.. మీ కుంటుంబ సభ్యులకు చెడు జరగకూడదంటే ఆ మొత్తం డబ్బు చెల్లించాలని అందులో రాసి ఉంది.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ మీడియాతో మాట్లాడుతూ.. మృతదేహం 45 ఏండ్ల వ్యక్తిదని.. పోస్టు మార్టం చేస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. గత మూడు, నాలుగు రోజులుగా తప్పిపోయిన వారందరి వివరాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే తులసి కుటుంబంలోని చిన్న అల్లుడు నిన్నటి నుంచి కనిపించకుండా పోయాడని గుర్తించినట్టు అస్మీ చెప్పారు. ఆస్తి తగదాలు, ఇతర కోణాల్లో కేసు దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు.