ఆయాగా పనిచేస్తున్న ఓ మహిళ పోలీస్ సిబ్బందికి కూల్ డ్రింక్ బాటిల్లు అందిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. లాక్ డౌన్ లో ఉన్న పోలీస్ సిబ్బందిపై మీరు చూపిస్తున్న ప్రేమకు మేమంతా సెల్యూట్ చేస్తున్నాం అంటూ మహిళను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన లోకమణి అనే మహిళ రెండురోజుల క్రితం మండుటెండలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందికి కూల్ డ్రింక్ బాటిళ్లను అందించింది. మహిళ ఇస్తున్న కూల్ డ్రింక్ బాటిళ్ల ను వద్దంటూ సున్నితంగా తిరస్కరించిన సిబ్బంది ..మహిళ మాటలు విని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ. మహిళ పేరు, ఏం చేస్తుంటావని అడగ్గా.. దానికి మహిళ స్థానికంగా ఆయాగా పనిచేస్తున్నానని, తన జీతం మూడు వేల అయిదు వందలని చెప్పింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తక్కువ జీతం తీసుకుంటున్నప్పటికీ.. మహిళ చేస్తున్న సాయం గొప్పదని, ఆమెది పెద్ద మనసు అని పోలీసులు మహిళను ప్రశంసించారు. అంతేగాకుండా వారి కోసం తీసుకొచ్చిన కూల్‌డ్రింక్స్‌ను ఇంట్లో వాళ్ల కోసం తీసుకెళ్లమని మహిళకు చెప్పారు. సందర్భంగా తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.
తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ సైతం ఆమెను అభినందించారు. మీడియా సమావేశంలో వీడియో కాల్ ద్వారా ఆమెను అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. మీ అమ్మతనానికి మేమంతా చలించిపోయాం. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై మీరు చూపిన ప్రేమకు మేమంతా సెల్యూట్ చేస్తున్నామమ్మా అంటూ ధన్యవాదాలు తెలిపారు. మీకు సెల్యూట్ చేస్తున్నాం అంటూ లోకమణిని డీజీపీ ప్రశంసించారు
