ఓ స్థల వివాదంలో గ్రామ పెద్దలకిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదని భార్యాభర్తలు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టారు. కృష్ణా జిల్లా హరిశ్చంద్రపురంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. భార్యాభర్తలిద్దరూ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టడంతో గ్రామస్తులంతా కంగారు పడ్డారు. వారు ఆత్మహత్య చేసుకోబోతున్నారనే అనుమానంతో వెంటనే పొలీసులకు కబురు పెట్టారు. తమకు చెందిన భూ వివాద పరిష్కారంలో గ్రామ పెద్దల వద్ద రూ.50 లక్షలు ఉంచామని, సమస్య పరిష్కారమైన కూడా పెద్దలు డబ్బు ఇవ్వలేదని ఆ దంపతులు ట్యాంకు పైకి ఎక్కి నిరసన తెలిపారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న సబ్ ఇన్ స్పెక్టర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. భూ వివాద విషయంలో గ్రామ పెద్దలు కేవలం రూ.29 లక్షలు మాత్రమే తీసుకున్నారని, ఆ మొత్తాన్ని కూడా తిరిగివ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పారన్నారు. అసలు ఆ దంపతులు, గ్రామ పెద్దల మధ్య ఎంత డబ్బు బదిలీ అయిందనే స్పష్టమైన సమాచారం లేదని, ఆ దంపతులు ఇంకా వాటర్ ట్యాంక్ పైనే ఉన్నారని ఎస్సై అన్నారు. వారిని క్రిందకు దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

