ఏపీలో లా స్టూడెంట్‌పై గ్యాంగ్‌ రేప్‌.. ప్రియుడే స్నేహితులతో కలిసి అఘాయిత్యం

పొరుగు రాష్ట్రం ఏపీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రేమ పేరుతో ఓ యువతికి దగ్గరైన యువకుడు ఆమెను శారీరకంగా లోబరుచుకోవడమే కాక స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడి గట్టాడు. ఈ ఘటనలో నలుగురు యువకులు.. యువతి నగ్న వీడియోలు చూపిస్తూ బాధితురాలని నెలల తరబడి అనుభవించారు. రోజులు గడిచే కొద్దీ వారి వేధింపులు మరీ ఎక్కువ అవ్వడంతో బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది. సకాలంలో తండ్రి ఆమెను కాపాడి.. ఏం జరిగిందని ప్రశ్నించగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఏం జరిగిందంటే..?

బాధితురాలు(23) విశాఖ మధురవాడలోని ఓ లా కాలేజీలో మూడో ఏడాది చదువుతోంది. ఆమెకు వంశీ అనే తోటి విద్యార్థితో స్నేహం కుదిరింది. ఆ స్నేహాన్ని అడ్డు పెట్టుకొని యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని శారీరకంగా లోబరుచుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 10న కంబాలకొండకు తీసుకెళ్లి అక్కడ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం మరోసారి ఆగస్టు 13న విద్యార్థినిని విశాఖపట్నం కృష్ణానగర్‌లోని తన స్నేహితుడి గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో అతని స్నేహితులు ఆనంద్, రాజేష్, జగదీశ్ జంట ఏకాంతంగా ఉన్న దృశ్యాలను రహస్యంగా వీడియో తీశారు. అనంతరం గదిలోకి వచ్చి ఆ వీడియో చూపించి యువతిని బెదిరించి ఒక్కొక్కరుగా అత్యాచారం చేశారు. 

అంతటితో ఆ కీచకుల వేధింపులు ఆగలేదు. యువతి నగ్నంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తరుచూ ప్రియుడి సేహితులు తమ కోర్కె తీర్చాలని వేధించటం.. మనిసిచ్చినోడు వారికి వత్తాసు పలకడంతో బాధితురాలికి మరో మార్గం లేకపోయింది. విషయం బయటకు తెలిస్తే కుటుంబం పరువు పోతుందని భావించి మౌనం వహించింది. కాలేజీకి కూడా వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటోంది. అయినప్పటికీ, వారి వేధింపులు ఆగలేదు. 

తమ కోరిక తీర్చాలంటూ ప్రియుడి స్నేహితులు పదే పదే ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేశారు. అండగా నిలబడాల్సిన లవర్ కూడా తన స్నేహితులు చెప్పినట్లు నడుచుకోవాలని చెప్పడంతో బాధితురాలు సోమవారం(నవంబర్ 18) తెల్లవారుజామున ఆత్మహత్యకు యత్నించింది. తన పడక గదిలోనే ఉరేసుకో బోయింది. గమినించిన తండ్రి ఆమెను కాపాడి.. ఏం జరిగిందని నిలదీయడంతో.. జరిగిందంతా తండ్రికి చెప్పుకుంది.

అనంతరం కుటుంబసభ్యుల సహకారంతో బాధితురాలు విశాఖ టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు లా చదువుతున్న యువకులు కాగా.. మరొకరు ఓ ప్రైవేటు మోటార్స్‌ కంపెనీలో క్యాషియర్‌ గా పని చేస్తున్నట్లు గుర్తించారు. అత్యాచారానికి పాల్పడ్డ యువకులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఏపీ హోంమంత్రి అనిత బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.