ఆంధ్రజన సంఘం ఏర్పాటు..మొదటి సమావేశం ఎప్పుడంటే?

హైదరాబాద్​ గౌలిగూడలోని వివేకవర్ధిని ఆడిటోరియంలో 1921, నవంబర్​ 11, 12వ తేదీల్లో హైదరాబాద్​ సోషియల్​ కాన్ఫరెన్స్​ (హిందూ హైదరాబాద్​ సంఘ సంస్కరణ సభ సమావేశం) జరిగింది. ఈ సమావేశానికి దొండికేశవ కార్వే(డి.కె.కార్వే) అధ్యక్షత వహించారు. పుణెలో నాధీబాయి దామోదర్​ థాక్రే మహిళా విశ్వవిద్యాలయ స్థాపకుడిగా కార్వేను పేర్కొంటారు. హైదరాబాద్​ సోషియల్​ కాన్ఫరెన్స్​లో పాల్గొన్న వక్తలు ఇంగ్లీష్​, ఉర్దూ, మరాఠీ భాషల్లో ప్రసంగించారు. డీకే కార్వే ప్రసంగం మరాఠీ, ఇంగ్లీష్​ల్లో కొనసాగింది. మొదటి రోజు మాడపాటి హనుమంతరావు తెలుగులో మాట్లాడారు. ఈయన తెలంగాణలో గొప్ప వక్త. అగ్ర నాయకుడు కావడం వల్ల మాడపాటి హనుమంతరావు ప్రసంగాన్ని ఎవరూ అడ్డుకోలేదు.

 నవంబర్​ 12న హైదరాబాద్​ న్యాయవాది అలంపల్లి వెంకట రామారావు తెలుగులో ప్రసంగించగానే కన్నడిలు, మరాఠీలు అడ్డుకున్నారు. ఈ కారణంగా అలంపల్లి తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపి వేయాల్సి వచ్చింది. దీనిని తెలుగు వక్తలు పెద్ద అవమానంగా భావించారు. 1921, నవంబర్​ 12న రాత్రి 8 గంటలకు హైకోర్టు న్యాయవాది టేకుమల రంగారావు ఇంట్లో సమావేశమయ్యారు. తెలుగు భాషా సంస్కృతులను కాపాడేందుకు ఆంధ్ర రాష్ట్ర జన సంఘం(రాజకీయేతర జన సంఘం)ను స్థాపించారు. ఈ సంస్థ మొదటి కార్యదర్శిగా మాడపాటి హనమంతరావు నియమితులయ్యారు. ఈ సంస్థ స్థాపనలో బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనమంతరావు, మందుముల నరసింగరావు, ఆదిరాజు వీరభద్రరావు, పాలకుర్తి సత్యనారాయణ, పాపిరెడ్డి, నడింపల్లి జానకిరామయ్య, ఈ.శేషాచార్యులు, అల్లూరి లక్ష్మీనారాయణ, కైలా బలవంతరెడ్డి, ముస్త్యాల సాంబయ్య, పందిటి రామస్వామి తదితరులు ప్రముఖ పాత్ర పోషించారు. 

తొలి సమావేశం

ఆంధ్రజన సంఘం తొలి సమావేశం 1922, ఫిబ్రవరి 14న రెడ్డి వసతి గృహంలో కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సంఘం పేరును నిజాం రాష్ట్ర జన సంఘంగా మార్చారు. కార్యదర్శిగా మాడపాటి హనుమంతరావును ఎన్నుకున్నారు. జన సంఘం చిత్తు నియమావళిని ఆమోదించారు. తెలంగాణలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమాలను చేపట్టడంలో ఆంధ్ర జనసంఘం ముఖ్య పాత్రను పోషించింది. 

నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం

నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం స్ఫూర్తితో పుట్టుకొచ్చిన సంస్థలన్నింటిని కలుపుకొని 1923, ఏప్రిల్​ 2న హన్మకొండలో ని మట్టెవాడ రామలింగేశ్వర ఆలయంలో జరిగిన రెండో సమావేశంలో ఆంధ్ర జన సంఘం నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘంగా మారింది.  మొదటి అధ్యక్షులుగా బారిస్టర్​ ఆర్​. రాజగోపాల్​రెడ్డి, కార్యదర్శిగా మాడపాటి హనుమంతరావు నియమితులయ్యారు. నిజాం ఆంధ్ర జన కేంద్ర సంఘం తెలుగు గ్రంథాలయాలను ఏర్పరచాలని, తెలుగు పుస్తక ప్రచురణలు, పత్రికలను ప్రోత్సహించాలని, తెలుగు చరిత్రను పరిశోధించి వెలుగులోకి తీసుకురావాలని, తెలుగు పండితులను, కవులను సన్మానించాలని నిర్ణయించారు. 
మూడో సమావేశంఆంధ్ర జన సంఘం మూడో సమావేశం 1926లో మధిరలో జరిగింది. ఈ సమావేశంతోపాటు తొలి గ్రంథాలయ సమావేశం కూడా జరిగింది. పింగళి రామిరెడ్డి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 

నాలుగో సమావేశం

రెండో గ్రంథాలయ సమావేశం 1927లో సూర్యాపేటలో నిర్వహించాలనుకున్నారు. కానీ నిజాం ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలో జాప్యం చేయడంతో చివరకు 1928లో సూర్యాపేటలో నిర్వహించారు. ఈ సమావేశానికి వామనరావు నాయక్​ అధ్యక్షత వహించాడు. ఈ సంఘం నిజాం రాష్ట్ర ఆంధ్ర ప్రశంస, నిజాం రాష్ట్ర ఆంధ్రులు, నిజాం రాష్ట్ర అభివృద్ధి మార్గములు అనే నాలుగు పుస్తకాలను ప్రచురించారు. ఆంధ్ర జన సంఘం ప్రచురించిన వర్తకులకు స్వేచ్ఛా వర్తక స్వాతంత్ర్యం (అవినీతి అధికారుల నుంచి వ్యాపారులకు రక్షణ కల్పించింది. సర్​ బారాహి అంటే అధికారులకు ఉచితంగా సరుకులు ఇవ్వడం), వెట్టిచాకిరి (వెట్టిచాకిరి రద్దుకు చర్యలు తీసుకొనేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చింది), మోతుర్భా మగ్గపు పన్ను ( చేనేతకారులపై విధించే ఈ మగ్గం పన్నును రద్దు చేశారు) ద్వారా పేరుగాంచింది. 

ఆంధ్ర బాలికోన్నత పాఠశాల

1928 నుంచి స్త్రీ విద్యావ్యాప్తికి ఆంధ్ర జన సంఘం విశేషంగా కృషి చేసింది. ఇందులో బాగంగానే మాడపాటి హనుమంతరావు హైదరాబాద్​లో ఆంధ్ర బాలికోన్నత పాఠశాలను స్థాపించారు. ఈ పాఠశాలలో తెలుగు మాధ్యమంలో విద్యను బోధించారు. ఉర్దూ భాషలో విద్యా బోధన చేసే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ పాఠశాలకు గుర్తింపు ఇవ్వడంతో మహారాష్ట్రలోని కార్వే యూనివర్సిటీకి అనుబంధంగా మెట్రిక్యులేషన్​ పరీక్షలు నిర్వహించారు.

ఆంధ్ర మహాసభగా మార్పు 

1930లో ఆంధ్రజన సంఘం మెదక్​లోని జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిజాం ఆంధ్ర కేంద్ర జనసంఘం ఆంధ్ర మహాసభ అనే పేరుతో ఒక రాజకీయ సంస్థగా అవతరించింది. ఆంధ్ర మహాసభ తెలంగాణలో మొదటి రాజకీయ సంస్థ. 

ఆంధ్ర పరిశోధనా మండలి

ఆంధ్ర జన సంఘం ఆంధ్ర పరిశోధన మండలి అనే పేరుతో చారిత్రక పరిశోధన మండలిని ఏర్పాటు చేసింది. ఆంధ్ర జన కేంద్ర సంఘానికి అనుబంధంగా ఆదిరాజు వీరభద్రరావు ఆంధ్ర పరిశోధక మండలిని స్థాపించి తెలంగాణలో చారిత్రక, సాంస్కృతిక, వైజ్ఞానిక వికాసానికి తోడ్పడ్డాడు. కొమర్రాజు లక్ష్మణరావు మరణానంతరం ఈ సంస్థ పేరును లక్ష్మణరాయ పరిశోధన మండలిగా మార్చారు. ఈ పరిశోధనా మండలికి మొదటి కార్యదర్శిగా ఆదిరాజు వీరభద్రరావు వ్యవహరించారు. ఈ పరిశోధక మండలి కృషి ఫలితంగా తెలుగువారికి సంబంధించిన అనేక చారిత్రక, సాంస్కృతిక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనేక మంది కవులు, రచయితలు, శాసనాలను, తాళపత్ర గ్రంథాలను సేకరించి, తెలుగువారి చరిత్ర సంస్కృతికి సంబంధించిన అనేక కొత్త అంశాలను వెలుగులోకి తీసుకువచ్చారు. వారిలో శేషాద్రి రమణ కవుల రచనలు విశిష్టమైనవి.

 ఆదిరాజు వీరభద్రరావు రచించిన తెలంగాణ శాసనాలు, ఆంధ్రుల చరిత్ర, సురవరం ప్రతాపరెడ్డి రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర, మాడపాటి హనుమంతరావు స్వీయ చరిత్ర (ప్రేమ్​ చంద్​ కథలు) ముఖ్యమైనవి. 1934లో వెలువడిన గోల్కొండ సంచిక తెలంగాణ సాహిత్యంలో ఒక గొప్ప మైలురాయి. సురవరం ప్రతాపరెడ్డి రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.  1930లో కాకతీయుల చరిత్ర/ కాకతీయుల చర్చాగోష్టి అనే అంశంపై వరంగల్​లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పండితులు, కవులు, ఆంధ్రుల చరిత్ర, సంస్కృతిపై రాసిన పలు రచనలు కలిగిన ఒక సంపుటిని తయారు చేశారు. ఈ సమావేశం అనంతరం వరంగల్​ నుంచి కాకతీ సంచిక అనే పేరుతో వెలువడింది.