Pottel Review: 'పొట్టేల్' రివ్యూ.. అనన్య నాగళ్ల, అజయ్ నటించిన రా అండ్ ర‌స్టిక్ మూవీ ఎలా ఉందంటే?

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల (Ananya Nagalla)  జంటగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మించిన చిత్రం ‘పొట్టేల్’(Pottel). ఈ మూవీ ఇవాళ శుక్రవారం (2024 అక్టోబర్ 25న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఒక రోజు ముందుగానే (అక్టోబర్ 24న) ప్రీమియర్స్ ప్రదర్శించింది. 

1980 నాటి నేపథ్యంలో తెలంగాణలోని ఓ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో ముఖ్యంగా జీవితంలో చదువు ఎంత ముఖ్యమనే విషయాల్ని ఎమోషనల్ గా తెరకెక్కించారు డైరెక్టర్ సాకేత్.

టీజర్, ట్రైలర్లో చూపించిన ఇంపాక్ట్.. సినిమా చూసాకా ఆడియన్స్లో ఎలాంటి అనుభూతిని కలిగించింది? పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ అంచనాలను మెప్పించిందా? లేదా అనేది రివ్యూలో చూద్దాం.

కథేంటంటే::

1970, 80వ దశకం నేప‌థ్యంలో సాగే పీరియాడిక‌ల్ క‌థ ఇది. విధర్భ (మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్) ప్రాంతంలోని గుర్రంగట్టు ఊర్లో ఈ కథ జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో పటేల్ వ్యవస్థ రాజ్యమేలుతున్న రోజులవి. గుర్రం గట్టు అనే ఈ గ్రామంలో.. ఆ ఊరి గ్రామ దేవత బాలమ్మకు ప్రతి పన్నెండేళ్లకు (పుష్క‌రానికి) ఓసారి జాత‌ర నిర్వ‌హిస్తుంటారు. అక్కడ ఓ పొట్టేల్ ని బలి ఇచ్చి జాతర చేయాలి. ఆ పొట్టేల్ని ఊరి పశువుల కాపరి జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి. అలా వంశపారంపర్యంగా పొట్టేల్ని కాపాడే బాధ్యత నాన్న(ఛత్రపతి శేఖర్) చనిపోవడంతో గంగాధ‌రీ (యువచంద్ర)కి వస్తుంది.

Also Read:-అంచనాలు పెంచేలా 'క' ట్రైలర్

కాగా ఇక్కడ గుర్రంగ‌ట్టు గ్రామానికి చిన్న ప‌టేల్ (అజ‌య్‌) చెప్పిందే వేదం. ఊరి గ్రామ‌దేవ‌త బాల‌మ్మ త‌న‌కు పూనుతున్న‌ట్లుగా (సిగం వచ్చినట్లుగా)న‌టిస్తూ అంద‌రిని చెప్పుచేతుల్లో పెట్టుకుంటాడు. వారి వంశపారంపర్యంగా అందరికీ పూనుతు వస్తున్న బాలమ్మ.. చిన్న ప‌టేల్ కు మాత్రం పూనదు. ఆ విషయం ఊరి పొట్టేల్‌ను కాపాడే గంగాధ‌రీకి మాత్రమే తెలుస్తుంది. అదే విషయాన్ని జనాలకు చెప్పినా నమ్మరు. ఆ పటేల్ ఏమో ఊర్లోని బలహీన వర్గాలను ఎదగనివ్వడు. చదువుకోనివ్వడు.

ఈక్రమంలో చిన్న ప‌టేల్ చేసే అక్ర‌మాల‌ను ఎదురించే గంగాధ‌రీ జీవితంలోకి బుజ్జ‌మ్మ (అన‌న్య నాగ‌ళ్ల‌) వ‌స్తుంది. పెద్ద‌ల‌ను ఎదురించి ఆమెను పెళ్లిచేసుకుంటాడు గంగాధ‌రి. అయితే తన తమ్ముడు చదువు లేకపోవడం వల్లే చనిపోయాడని, తన చదువు కోసం తన తండ్రి చనిపోయాడని, చదువు చాలా ముఖ్యమని గంగధారి తన కూతురు సరస్వతి (తనస్వి)ని ఎలాగైనా చదివించాలని పట్టుపడతాడు.

ఈ నేపథ్యంలో ఆ ఊరి టీచర్ దుర్యోధన్ (శ్రీకాంత్ అయ్యంగార్)కి ఏం కావాలంటే అది తెచ్చి ఇచ్చి కూతురుకి సీక్రెట్గా చదువు చెప్పిస్తూ ఉంటాడు. ఇంతలోనే గంగాధ‌రీ సంర‌క్ష‌ణ‌లోని పొట్టేల్ మాయం అవుతుంది. జాత‌ర ద‌గ్గ‌ర ప‌డుతుందన‌గా పొట్టేలు ఎలా మాయం అయింది? దాంతో జాతర టైంకి పొట్టేల్‌ను తీసుకు రావాలని ఊరి నుంచి గంగాధ‌రీని వెలివేయడం.. పొట్టేల్‌తో తిరిగి రాకపోతే తన కూతుర్ని బలి ఇస్తానని పటేల్ ఎందుకు అనాల్సి వస్తోంది?

చివరికి గంగాదరీ పొట్టేల్ని కనిపెట్టాడా? ఆ ప్రాసెస్ లో పెద్ద గంగాదరీకి ఎదురైన కష్టాలు ఏంటి? మరి సరస్వతి చదువుకుందా లేదా? ఇంత‌కీ పొట్టేల్‌ని మాయం చేసిందెవ‌రు? బుజ్జ‌మ్మ చిన్న ప‌టేల్ పై కోపం పెంచుకోవడానికి కారణాలేంటి? అనే తదితర విషయాలు తెలియాలంటే సినిమా థియేటర్లలో చూడాల్సిందే.

ఎలా ఉందంటే::

1980 నాటి నేపథ్యంలో తెలంగాణలోని ఓ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో ముఖ్యంగా జీవితంలో చదువు ఎంత ముఖ్యమనే విషయాల్ని ఎమోషనల్ గా తెరకెక్కించారు. తన కూతురిని ఎలాగైనా చదివించాలని కష్టపడే ఓ సగటు మధ్యతరగతి తండ్రి పడే ఆరాటం.. అందుకు ఎదురైనా సమస్యలు? ఈ క్రమంలో ప్రేమగా పెంచుకుంటున్న పొట్టేల్ తప్పిపోవడం, రాజులు, రాచరికం, మూఢనమ్మకాలు, అణగారిన వ్యవస్థ వంటి సన్నివేశాలను కథగా అల్లుకుని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా ఆవిష్క‌రించే ప్రయత్నం చేసాడు డైరెక్టర్.

1970-80 కాలంలో తెలంగాణలోని ప‌ల్లెటూళ్ల‌లో ప‌టేల్ వ్య‌వ‌స్థ ఎలా ఉండేది. అట్ట‌డుగు వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను బానిస‌లుగా మార్చుతూ ప‌టేళ్లు ఎలాంటి అన్యాయాలు సాగించారు? అనే పాయింట్ తో డైరెక్టర్ సాహిత్ రాసుకున్న కథనం బాగుంది. కొంత మేరకు హింస చూపించడం ఎక్కువ అవ్వడంతో.. భావోద్వేగాల‌తో మ‌న‌సుల్ని క‌ట్టిప‌డేసే కథ డల్ అయినా ఫీలింగ్ అయితే వస్తోంది. కానీ, సినిమా కంప్లీట్‌గా రా అండ్ ర‌స్టిక్‌గా సాగడం ఆడియన్స్కు థ్రిల్ ఇస్తోంది.

ఫస్టాఫ్ విషయానికి వస్తే.. ప‌ల్లెటూళ్ల‌లో ప‌టేల్ వ్య‌వ‌స్థ ఎలా ఉండేది. అట్ట‌డుగు వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను బానిస‌లుగా మార్చుతూ ప‌టేళ్లు ఎలాంటి అన్యాయాలు సాగించారు? హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ‌క‌థ త‌దిత‌ర స‌న్నివేశాలు కాల‌క్షేపాన్నిస్తాయి. ఇక మెయిన్ గా జీవితాలను మార్చే చదువును ప‌టేల్ వ్య‌వ‌స్థలో ఎలా దూరం చేశార‌నే అంశాల‌తో సాగింది.

సెకండాఫ్ లో పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ, భావోద్వేగాలు ఇలాంటి స‌న్నివేశాల్ని డైరెక్టర్ మ‌లిచిన‌ విధానం బాగుంది. దేవుడి పేరు చెప్పుకొని కొంతమంది చేసే మోసాలు, కులాంతర వివాహం వంటి అంశాలు కూడా చూపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నేటివిటీతో పాటు యాక్ట‌ర్స్ లుక్‌, యాస, భాష‌ల‌తో ఆనాటి కాలాన్ని రీక్రియేట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు.

ఎవరెలా చేశారంటే::

గంగాధ‌రీ పాత్రలో నటించిన హీరో యువచంద్ర తనదైన నటనతో మెప్పించాడు. పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా అందులో అమాయ‌కత్వం.. కథలో చూపించాల్సిన ఎమోషన్ ను బాగా పండించాడు. బుజ‌మ్మ పాత్ర‌లో అన‌న్య నాగ‌ళ్ల అదరగొట్టేసింది. సంఘర్షణతో కూడిన పాత్రలో నటించడమే కాకుండా.. అందులో పూర్తిగా ఒదిగిపోయింది.

ప‌టేల్ పాత్ర‌లో అజ‌య్ తన నటనతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. విక్రమార్కుడు లోని తిట్ల పాత్ర తర్వాత మరోసారి పొట్టెల్ పాత్ర గుర్తిండిపోయేలా నటించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అజయ్ తన విశ్వరూపం చూపించాడు. చిన్న పాప తనస్వి కూడా అద్భుతంగా యాక్ట్ చేసింది. టీచర్ పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ కూడా ప‌ర్వాలేద‌నిపించారు. 

సాంకేతిక అంశాలు::

రస్టిక్ కంటెంట్తో కూడిన పొట్టేల్ కు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర ఓ ప్రయోగం చేశాడు. సాంగ్స్, బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్​ చిత్రంపై ప్ర‌భావం చూపించాయి.  మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ పరంగా మాత్రం నిర్మాతలు బాగానే ఖర్చుపెట్టినట్టు విజువల్స్ రిచ్ గా ఉన్నాయి.

ఇకపోతే డైరెక్టర్ సాహిత్ మోత్కూరి రైటింగ్, మేకింగ్ బాగుంది. పిల్లల చదువు కోసం పేరెంట్స్ ఎంత స్ట్రగుల్ అయినా పడాలి అనే మంచి సందేశంతో వచ్చారు. అందుకు విలేజ్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సాగే కథని రాసుకుని ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.

NOTE: పొట్టెల్ సినిమాకు సెన్సార్ బోర్డ్ 'U/A' సర్టిఫికేట్ జారీ చేసింది. 

'U/A' సర్టిఫికేట్: ఎవరైనా  దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు,  కొంతవరకు నగ్నత్వం ఉంటుంది. 

  • Beta
Beta feature