ప్లాస్టిక్ తెచ్చిచ్చి గోల్డ్ తీస్కెళ్లండి!

ప్లాస్టిక్ తెచ్చిచ్చి గోల్డ్ తీస్కెళ్లండి!

15 రోజుల్లోనే ఊర్లో ప్లాస్టిక్ మాయం  

అనంత్ నాగ్ :
అది దక్షిణ కాశ్మీర్​లోని అనంత్ నాగ్ జిల్లాలోని సాడీవారా గ్రామం. చాలా ఊర్లలాగే ఆ ఊరు కూడా ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయింది. రోడ్ల వెంట, వీధుల్లో ఎక్కడ చూసినా వాడి పారేసిన పాలిథీన్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. చెత్తను తొలగించేందుకు గ్రామ పంచాయతీ నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ పేరుకుపోతూనే ఉంది. అందుకే ఆ గ్రామ సర్పంచ్, అడ్వొకేట్ ఫరూక్ అహ్మద్ గనై ఒక ప్లాన్ వేశాడు.

గ్రామస్తులు 20 క్వింటాళ్ల ప్లాస్టిక్​ను సేకరించి ఇస్తే పంచాయతీ తరఫున ఒక గోల్డ్ కాయిన్ ఇస్తామని ప్రకటించాడు. దీంతో ఊరోళ్లంతా ప్లాస్టిక్ వేటలో పడ్డారు. రోడ్లు, వీధుల వెంబడి మాత్రమే కాదు.. ఊరి పక్కనున్న నదిలో, వాగులు, కాలువల్లోనూ పడి ఉన్న ప్లాస్టిక్ ను సేకరించి తీసుకొచ్చారు. మొత్తంగా పదిహేను రోజుల్లోనే ఊరంతా ప్లాస్టిక్ చెత్త లేకుండా క్లీన్ అయిపోయింది. గ్రామాలను క్లీన్​గా ఉంచుకోవడంలో సాడీవారా ఇతర గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలిచిందని ఉన్నతాధికారులు మెచ్చుకుంటున్నరు. అయితే.. గ్రామంలో ప్లాస్టిక్ చెత్తను సేకరించినందుకు ఎంత మందికి గోల్డ్ కాయిన్ లు ఇచ్చారన్నది మాత్రం వెల్లడి కాలేదు.