పర్మిషన్ ఇస్తవా.. చావమంటవా?

  • పెట్రోల్ బాటిల్ తో పంచాయతీ సెక్రటరీని నిలదీసిన వృద్ధురాలు
  • నారాయణ పేట జిల్లాలో ఘటన

మద్దూరు, వెలుగు : ‘ఇల్లు కట్టేందుకు పర్మిషన్ ఇస్తవా.. పెట్రోల్ పోసుకొని చావమంటవా..?’ అంటూ ఓ వృద్ధురాలు గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు పెట్రోల్‌‌ బాటిల్ తో నిరసనకు దిగింది. నారాయణ పేట జిల్లా మద్దూరు మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన ఈడిగి పద్మమ్మ భర్త నారాయణ ఇటీవల చనిపోయాడు. వారి పెద్ద కొడుకు రాములు హైదరాబాద్ లో స్థిరపడగా..చిన్న కొడుకు సత్తయ్య గ్రామంలోనే ఉంటున్నాడు. పద్మమ్మ తన భర్త చనిపోయాక చిన్నకొడుకుతోనే ఉంటుంది.

కొంతకాలంగా చిన్నకొడుకు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. దాంతో పద్మమ్మ గ్రామంలోనే తన భర్త పేరు మీద ఉన్న ఇంటి స్థలాన్ని అమ్మి ఆ డబ్బులతో బతకాలని నిర్ణయించుకుంది. దామర్ గిద్ద మండలం మొగల్ మడ్క గ్రామానికి చెందిన కొమ్మూరు ఆంజనేయులుకు స్థలాన్ని విక్రయించింది. కాగా..అక్కడ ఇల్లు కట్టేందుకు తనకు పర్మిషన్ ఇవ్వాలని గ్రామ పంచాయతీ సెక్రటరీని ఆంజనేయులు కోరారు.  విషయం తెలిసిన పెద్దకొడుకు రాములు తమకు తెలియకుండా స్థలం ఎలా కొంటావ్ అంటూ ఆంజనేయులును ప్రశ్నించాడు.

స్థలం మాకు కావాలంటూ అతనితో గొడవకు దిగాడు. ఈ వివాదంతో ఆంజనేయులుకు పర్మిషన్ ఇచ్చేందుకు పంచాయతీ సెక్రటరీ నిరాకరించాడు. చేసేదిలేక ఆంజనేయులు పద్మమ్మ వద్దకు వెళ్లి.. నీ కొడుకులు స్థలం కోసం తనతో గొడవ పడుతున్నారని..డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. దాంతో పద్మమ్మ మంగళవారం పెట్రోల్ బాటిల్ తో గ్రామ పంచాయతీ ఆఫీస్ కు వెళ్లింది.  స్థలం తన భర్తదని తానే అమ్మినట్లు పంచాయతీ సెక్రటరీకి తెలిపింది.

అక్కడ ఇల్లు కట్టుకునేందుకు ఆంజనేయులుకు పర్మిషన్ ఇవ్వకుంటే  పెట్రోల్ పోసుకొని సచ్చిపోతా అంటూ ఆఫీస్ ముందు నిరసనకు దిగింది. ఎవరు చెప్పినా వినకుండా మొండికేసింది. చివరకు పోలీసులు వచ్చి న్యాయం చేస్తామని సర్ది చెప్పడంతో ఆమె తన నిరసనను విరమించింది.