అక్కడ అన్న.. ఇక్కడ చెల్లె.. అప్పర్ హ్యాండ్ కోసమేనా ఇదంతా?

  • స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం కవిత ధర్నా
  • అదే టైంలో రైతుల ఇష్యూపై కేటీఆర్ ప్రెస్ మీట్
  • అప్పర్ హ్యాండ్ కోసమే ఇద్దరు నేతల ఆరాటమా..?
  • ఆసక్తికరంగా మారిన అన్నా, చెల్లెలు పాలిటిక్స్
  • అయోమయంలో బీఆర్ఎస్ క్యాడర్  

హైదరాబాద్: ఇవాళ బీఆర్ఎస్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత తన సొంత సంస్థ భారత జాగృతి ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లపై ధర్నా నిర్వహించారు. ఇందిరా పార్కు వద్ద ఆమె ధర్నా చేస్తున్న సమయంలో ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించి.. రైతు భరోసాపై మాట్లాడారు. 

పదేండ్ల నుంచే తాము రైతు బంధు ఇస్తున్నామని, వాళ్ల ఖాతాల్లోనే డైరెక్టుగా డబ్బులు వేస్తే సరిపోతుందని అన్నారు. రైతులు  మళ్లీ ఎందుకు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రశ్నించారు. అయితే అదే సమయంలో కవిత బీసీల పక్షాన గొంతెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

ALSO READ | ఫార్ములా- ఈ కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం.. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు..

అయితే కవిత చేపట్టిన ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ వెళ్లి సంఘీభావం చెప్తారని అంతా భావించారు. అయితే అదే సమయంలో ఆయన తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని క్యాడర్ చర్చించుకోవడం కనిపించింది.

 గత కొంత కాలంగా అన్నా చెల్లెళ్లు రాజకీయంగా అప్పర్ హ్యాండ్ కోసం పోటీపడుతున్నారనే టాక్ ఉంది. ఈ క్రమంలోనే కవిత తన సొంత సంస్థ భారత జాగృతి వేదికగా బీసీ రిజర్వేషన్లపై ధర్నా నిర్వహించిందని తెలుస్తోంది. అదే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి రైతుల అంశాన్ని ప్రస్తావించడంతో క్యాడర్ లో కన్ఫ్యూజన్ ఏర్పడింది.