సూరారంలో కారు బీభత్సం..ఓవర్స్పీడ్తో చెరువులోకి దూసుకెళ్లిన వైనం

సూరారంలో కారు బీభత్సం..ఓవర్స్పీడ్తో చెరువులోకి దూసుకెళ్లిన వైనం
  • నంబరు ప్లేటు మార్చి కారు మాయం చేసిన స్థానిక లీడర్లు

జీడిమెట్ల, వెలుగు: సూరారంలో ఓ ఇన్నోవా కారు బుధవారం బీభత్సం సృష్టించింది. ఓవర్​స్పీడ్​తో చెరువులోకి దూసుకెళ్లింది. కట్టమైసమ్మ టెంపుల్ మూల మలుపు వద్ద తొలుత బతుకమ్మ కొలను కంచెను ఢీకొట్టి, చెరువులో పడిపోయింది. ప్రమాదం తర్వాత కారులోని ముగ్గురు వ్యక్తులు పారిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడి నుంచి మాయం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు కారులో ఉన్నది ఎవరు? వారు మద్యం తాగి ఉన్నారా? లేక ఏదైనా అసాంఘిక కార్యకలాపాల కోసం కారు వాడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  సదరు కారు ఓ వ్యాపార వేత్తకు సంబంధించిదని, దీంతో కొందరు ప్రజాపత్రినిధులు స్వయంగా రంగంలోకి దిగి కారు నంబరు ప్లేటు మార్చి మరీ క్రేన్​సాయంతో అక్కడి నుంచి మాయం చేసినట్లు స్థానికులు చర్చించుకున్నారు. పోలీసులు కారు మాయం కావడంపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.