కర్నూలు: ప్రేమించానంటూ వెంటపడ్డాడు… మనిద్దరిదీ ఒకే కులం.. మా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. నమ్మినందుకు వాడుకుని మొహం చాటేశాడు. అంతే కాదు మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడిన ప్రియుడిని నిలదీసి అడిగితే… నేనిప్పుడు ఉద్యోగిని.. మా నాన్న కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు.. నీవు ఆఫ్టరాల్ ఆటో వాలా కూతురువు.. నిన్ను ఎలా చేసుకోమంటావన్నాడు. వారి పెద్దల వద్దకు వెళ్లి అడిగితే.. మా వాడికి 23లక్షల కట్నం ఇచ్చే సంబంధం వచ్చింది.. మరి నీవేం తెస్తావని అడగడంతో బాధితురాలు షాక్ గురైంది. ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిందీ సంఘటన.
బాధితురాలు తనకు అన్యాయం చేయొద్దని ప్రియుడిని కాళ్లా వేళ్లా పడి కన్నీటితో బతిమాలితే.. నేనిప్పుడు ఉద్యోగిని.. నీవు ఆటోవాటా కూతురివి… నీ రేంజ్ కు తగ్గ సంబంధం ఏదైనా చూసుకో… నీ పెళ్లికి సహాయం చేస్తానన్నాడు. నాలుగేళ్లు తన వెంట తిరిగిన ప్రియుడి నోటి వెంట వస్తున్న మాటలు బాధితురాలికి దిక్కుతోచక రోడ్డుపై పడి విలపించింది. మహిళా సంఘం వారు వచ్చి ధైర్యం చెప్పడంతో న్యాయ పోరాటానికి సిద్ధమైంది. తన ప్రియుడుతో తనకు పెళ్లి జరిపించాలంటూ బండిఆత్మకూరు బస్టాండులో దీక్ష చేపట్టింది. మహిళా, ప్రజా సంఘాలు బాధితురాలికి అండగా నిలిచాయి. బీటెక్ చదువుతున్నప్పుడే యువతి వెంట తిరిగి… పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అన్ని రకాలుగా వాడుకుని.. తీరా ఉద్యోగం వచ్చిందని మోసం చేసిన బండి ఆత్మకూరు మండలం పరమటూరుకు చెందిన ముల్లా అబ్దుల్ రెహమాన్.. ఇదే మండలంలోని పార్నపల్లె గ్రామ సచివాలయంలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. దీంతో వ్యవహారం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.
