కుక్క అడ్డువచ్చి విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. ముగ్గురికి తీవ్రగాయాలు

స్కూల్అయిపోయింది. సాయంత్రమైంది..ఇక ఇంటికి వెళ్లి ఆటలాడుకోవాలనుకున్న ఆ చిన్నారులకు ఒక్కసారిగా అనుకోని యాక్సిడెంట్ రూపంలో విషాద సంఘటన ఎదురైంది. యాక్సిడెంట్ తో గాయాలై బాధిస్తుంటే.. వారి ఏడుపులు ఆ ప్రాంతమంతా మార్మోగాయి.  ఒకరు కాదు ఇద్దరు కాదు.. 12 మంది పిల్లలు.. అందరూ 10 ఏళ్ల లోపు వారే.. వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయపడిన విద్యార్థుల బాధ వర్ణించలేనిది. వివరాల్లోకి వెళితే..

వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ సమీపంలో విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తాపడింది. హైదరాబాద్ -బీజాపూర్ హైవేపై ఈ ఘటన జరిగింది. సమ యంలో ఆటోలో 12 మంది విద్యార్థులు ఉన్నారు.ప్రమాద ఆటో డ్రైవర్ తో పాటు ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గాయపడ్డవారిని 108 ద్వారా పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. 

పరిగిలోని టీచర్స్ కాలనీలో ఉన్న ఎమ్ఎఫ్ మదర్సా నుంచి ఆటోలో బొంరాస్ పేట వెళ్తుండగా వీధి కుక్క ఆటోకు అడ్డురావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విద్యార్థులంతా 8 నుంచి10 సంవత్సరాల వయసులోపు వారే.. గాయాలతో విద్యార్థుల ఏడుపులతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.