వారిద్దరూ అమ్మ కడుపులో నుంచి అతుక్కుని పుట్టారు. 2003 జూన్ 14న పుట్టిన ఈ ఇద్దరూ ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో పుట్టారు. ఆ ఇద్దరికీ గుండె, కిడ్నీలు, చేతులు, వెన్నెముక వేర్వేరుగా ఉన్నాయి. కానీ లివర్, గాల్ బ్లాడర్, కాళ్లు మాత్రం ఇద్దరికీ కలిపి ఉన్నారు. అలా పుట్టిన పిల్లలను సాదుకోవాల్సిన తల్లిదండ్రలు.. ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు. అయితే ప్రభుత్వం అక్కున చేర్చుకుని.. వారికి ట్రీట్‌మెంట్ చేయించే ప్రయత్నం చేసింది. వాళ్లను వేర్వేరుగా చేసేందుకు ఉన్న అవకాశాలను ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు కూడా పరిశీలించారు. కానీ సర్జరీ చేస్తే ఒక్కరు కూడా బతకడం కష్టమని డాక్టర్లు తేల్చారు. దీంతో ఆ ఇద్దరూ అలానే పెరిగారు. వారిని పంజాబ్‌లోని ఆలిండియా పింగల్వారా ఛారిటబుల్ సొసైటీ దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసింది. ఆ ఇద్దరికీ సోహ్నా, మోహ్నా అని పేర్లు పెట్టారు ఆశ్రమ సిబ్బంది.
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా
అతుక్కుని పుట్టిన పిల్లలు పెరగడానికి, రోజు వారీ పనుల చేసుకోవడానికే ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి ఈ పిల్లలు ఎంతో మనో ధైర్యంతో ముందుకు సాగి.. ఎలక్ట్రికల్ ఇంజనీరంగ్‌లో డిప్లొమా చదివారు. నలుగురికీ ఆదర్శంగా నిలవాలన్న తపనతో ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే ఆగిపోకుండా తమకు ఉన్న స్కిల్‌తో ప్రైవేట్‌గా ఎలక్ట్రికల్ వర్క్స్ చేయడం మొదలుపెట్టారు. అలాగే పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (PSPCL)లో జాబ్ కొట్టాలన్న పట్టుదలతో అనుకున్నది సాధించారు. డిసెంబర్ 20న అమృత్‌సర్‌లో ఉన్న 66 కేవీ సబ్ స్టేషన్‌లో జాబ్‌లో చేరారు. ఈ జాబ్‌లో చేరేందకు తమకు అవకాశం కల్పించిన పంజాబ్ ప్రభుత్వం, పింగల్వారా ఛారిటబుల్ సొసైటీకి థ్యాంక్స్ చెప్పారు ఆ ఇద్దరు కవలలు సోహ్నా, మోహ్నా.
Amritsar | Conjoined twins, Sohna and Mohna, bag a job in the Punjab State Power Corporation Limited (PSPCL)
— ANI (@ANI) December 23, 2021
"We're very glad about the job & have joined on Dec 20. We thank the Punjab govt & the Pingalwara institution, which schooled us, for the opportunity," they say pic.twitter.com/vNieE4jBiJ
రూ.20 వేల జీతం..
ఈ అవిభక్త కవలలిద్దరినీ డిజేబుల్ కోటా రిక్రూట్ చేసుకున్నామని PSPCL సీఎండీ వేణు ప్రసాద్ తెలిపారు. వారిద్దరికీ కలిపి రూ.20 వేల జీతం ఇవ్వనున్నట్లు చెప్పారు. తమ లోపాన్ని కూడా జయించి వాళ్లు డిప్లొమా పూర్తి చేశారని, ఎలక్ట్రీషియన్స్‌గా పని చేయాలన్న పట్టుదలతో చాలా బాగా పని నేర్చుకున్నారని అన్నారు. వారికి ప్రభుత్వ ఉద్యోగం రావడం తమకు ఎంతో గర్వంగా ఉందని ఆలిండియా పింగల్వారా ఛారిటబుల్ సొసైటీ చైర్‌పర్సన్ ఇంద్రజిత్ కౌర్ తెలిపారు. కాగా, సోహ్నా, మోహ్నా పింగల్వారా సొసైటీ నుంచి ఆఫీసుకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుకొచ్చింది.
