- జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు (50) మృతి
- ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఐదుగురు సిబ్బంది
- అమోనియా గ్యాస్ వచ్చే పైపు హై ప్రెషర్ తో బ్లాస్ట్
- పొగ కమ్ముకోవడంతో నలుగురు బయటకు వచ్చేశారు
- ఫ్యాక్టరీ బయట ఎలాంటి ప్రమాదం లేదు..
నంద్యాల వాసులు ఆందోళన చెందొద్దు: కలెక్టర్ వీరపాండియన్ కర్నూలు : నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ లోపల గ్యాస్ లీకైన ఘటనలో జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు (50) మృతి చెందారు. డిస్టిలరీ విభాగంలో దాదాపు రెండు టన్నుల అమోనియా నిల్వ ఉంచారు. అమోనియా నుంచి కార్బన్ డయాక్సైడ్ తయారు చేసే సమయంలో హై ప్రెషర్ వల్ల పైప్ లీకేజ్ అయింది. దుర్వాసనతో పొగ కమ్ముకోవడంతో పనిచేస్తున్న ఐదుగురిలో నలుగరు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసి ఫైర్ సిబ్బందికి సమాచారం తెలిపారు. ఇటీవలే విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో నంద్యాలలో గ్యాస్ లీకేజీ జరిగిందన్న సమాచారం స్థానికులను ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసింది. చిన్నపాటిదే కావడం.. వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి లీకేజీని అదుపు చేశారు.
విషయం తెలిసిన వెంటనే నంద్యాల ఆర్డీవో రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ రవికుమార్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించగా… కర్నూలు నుండి జిల్లా కలెక్టర్ వీర పాండియన్, జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప హుటాహుటిన నంద్యాలకు వచ్చి గ్యాస్ లీకైన ఫ్యాక్టరీని తనిఖీ చేశారు. ఫ్యాక్టరీ యజమాని, ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డితో మాట్లాడారు. ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీలో పనిచేస్తుూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రాణాలు కాపాడుకున్న నలుగురు కార్మికులతో కూడా కలెక్టర్ మాట్లాడి ప్రమాదం గురించి ఆరా తీశారు. ప్రమాదం గురించి తెలుసుకుని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రవి పఠాన్ షెట్టి హుటాహుటిన ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీకి తరలివచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ మీడియాతో మాట్లాడుతూ… ఫ్యాక్టరీ లోపల ఐదుగురు వర్కర్లు మెయిన్ టెనెన్స్ వర్క్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. మెయిన్ టెనెన్స్ వర్క్ కంప్లీట్ అయి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అమోనియా గ్యాస్ రిలీజ్ అయిన వెంటనే పైపు హై ప్రెషర్ కు తట్టుకోలేక బ్లాస్ట్ అయింది.. వెంటనే పొగ వ్యాపించడంతో ప్రాసెసింగ్ పని చేస్తున్న నలుగురు కార్మికులు బయటకు వచ్చేశారు.. లోపల పనిచేసుకుంటూ ఉండిపోయిన జీఎం శ్రీనివాసరావుకు వెంటనే తెలియజేసినా.. ఆయన రాలేక పొగపీల్చుకుని ఊపిరాడక ఫ్యాక్టరీలోపలే కుప్పకూలి చనిపోయారు. ఈ ప్రమాదం గురించి స్థానికులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు మొత్తం ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తున్నామని చెప్పారు.

