అమ్మఒడి పధకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ ఏడాదికి రూ.15వేలు ఇచ్చే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ పథకం తీసుకొస్తోంది. ఇటీవల ఈ పథకం అమలుపై పలు సందేహాలు వినిపించాయి. అర్హులు ఎవరనే దానిపై అయోమయం కనిపించింది. దీంతో.. అపోహలు తొలగిస్తూ క్లారిఫికేషన్ ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
పేద తల్లులు తమ పిల్లలను ఏ బడికి పంపినా అమ్మఒడి పథకం వర్తిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఆ పిల్లలు చదివేది ప్రైవేటు స్కూల్ అయినా, ప్రభుత్వ స్కూల్ అయినా అమ్మఒడి వర్తిస్తుందని చెప్పింది. పిల్లలను బడికి పంపే తల్లులకు వైట్ రేషన్ కార్డు ఉండాలని సూచించింది. పిల్లలను బడికి పంపే పేద తల్లులకు ప్రతి ఏటా జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా రూ.15వేలు అందిస్తామని తెలిపింది.
త్వరలోనే ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచే చర్యలు ప్రారంభం కాబోతున్నాయని ఏపీ సర్కారు వివరించింది. రాష్ర్టంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
