- అందుకే 4% ముస్లిం రిజర్వేషన్లు తొలగించాం: అమిత్‌షా
- కర్నాటకలో పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తమని ధీమా
బాగల్కోట్(కర్నాటక): మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలనే నియమం ఏదీ రాజ్యాంగంలో లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అందుకే కర్నాటకలో 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు తొలగించామని చెప్పారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం బాగల్కోట్ జిల్లా హునగొండ లో నిర్వహించిన సభలో అమిత్ షా మాట్లాడారు. “చాలా ఆలోచించే రిజర్వేషన్లలో మళ్లీ రిజర్వేషన్లు పెట్టారు. 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను 6 శాతానికి పెంచుతామని చెప్తున్న కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య.. మరీ ఎవరి రిజర్వేషన్లకు కోత పెడ్తారో కర్నాటకలో ఎన్నికల ప్రచార గడువు ముగిసే లోపు స్పష్టం చేయాలె’’ అని డిమాండ్ చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)ను బ్యాన్ చేసి బీజేపీ ప్రభుత్వం దేశంలో శాంతి భద్రతలను కాపాడింది.
అయితే బీజేపీ చర్యను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఆ సంస్థపై నిషేధం ఎత్తివేస్తామని చెప్తున్నది. “4 శాతం ముస్లిం రిజర్వేషన్లను బీజేపీ ఎట్టి పరిస్థిత్తుల్లో ఒప్పుకోదు. అలాగే లింగాయత్‌లకు కేటాయించిన 6 శాతం రిజర్వేషన్లలో కోత పెడ్తామంటే ఎంత మాత్రం అంగీకరించదు”అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రతిచోట తప్పుడు హామీలు ఇస్తున్నదని.. ఎన్నికల్లో ఓడిపోతున్నదని ఎద్దేవా చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సోషల్ డెమెక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ), పీఎఫ్ఐ మద్దతు తీసుకుంటున్నదని.. కన్నడ ప్రజలకు ఇది ఎంత మాత్రం నచ్చదని.. దీనిపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. కర్నాటకలో బీజేపీ పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పారు.
‘మైతై’లకు ఎస్టీ హోదాపై అందరి అభిప్రాయంతో నిర్ణయం
మణిపూర్‌లో తీవ్ర అనిశ్చితికి కారణమైన ‘మైతై’ వర్గానికి ఎస్టీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. మణిపూర్‌లో హింస, తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొనడంపై సోమవారం ఆయన మాట్లాడారు. మైతైలకు ఎస్టీ హోదా ఇచ్చే విషయంలో మణిపూర్ రాష్ట్ర సర్కార్ అన్ని ప్రభావిత వర్గాల అభిప్రాయాలు తెలుసుకొని తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఈ అంశంపై అన్ని వర్గాలతో చర్చించండని కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. మణిపూర్ సర్కార్ అందరితో సంప్రదింపులు జరిపి సరైన నిర్ణయం తీసుకుంటుందని.. ఇకపై ఈ విషయంలో ఏ వర్గం కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమిత్ షా చెప్పారు.
