టీడీపీ అధినేత చంద్రబాబుపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన టీడీపీతో పొత్తు గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్డీయే నుండి, బయటకు వెళ్ళాక ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారని, కాంగ్రెస్ తో జతకట్టి 2019లో ఓడిపోయారని అన్నాడు. ఎన్నికల్లో ఓడిపోయాక మౌనం వహించిన చంద్రబాబు ఇప్పుడు పరిస్థితి అర్థమయ్యాక ఎన్డీయేలో కలుస్తామని వచ్చారు కాబట్టే తిరిగి ఎన్డీయేలో కలుపుకున్నామని అన్నారు అమిత్ షా.
అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీలో, ఇటు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. పొత్తులో ఉన్న పార్టీ నాయకుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేయటం సరికాదని టీడీపీ శ్రేణులు అంటుండగా, నేషనల్ మీడియా సాక్షిగా చంద్రబాబు పరువు పోయిందని, బాబు బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకున్నాడు అన్న మాట అనడం ఒక్కటే తక్కువ అంటూ వైసీపీ శ్రేణులు కామెంట్ చేస్తున్నారు.
ఇదే ఇంటర్వ్యూలో పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు మద్దతిచ్చిన వైఎస్సార్సీపీని కాదని టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, పార్లమెంటులో పార్టీలను బట్టి నిర్ణయాలు ఉండవని, వైసీపీ అన్ని బిల్లులకు మద్దతివ్వలేదని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొన్ని బిల్లులకు మద్దతిచ్చిందని, కొన్ని బిల్లులకు మద్దతివ్వలేదని అన్నారు. ఏదేమైనా బీజేపీతో పొత్తు కుదిరిందన్న ఆనందం పొత్తు కోసం బాబు ఢిల్లీలో పడిగాపులు కాసినంత సేపు కూడా లేకుండా చేశాయి అమిత్ షా వ్యాఖ్యలు.