అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యల దుమారం..పార్లమెంటు వద్ద తోపులాట

  • కింద పడ్డ ఒడిశా ఎంపీ.. తలకు గాయం
  • రాహుల్ గాంధీ నెట్టేశారంటున్న బీజేపీ
  • బీజేపీ ఎంపీలు తననే వెనక్కి నెట్టారంటున్న రాహుల్ 
  • కాంగ్రెస్ Vs బీజేపీ.. పోటా పోటీగా నినాదాలు
  • అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల దుమారం
  • 2 గంటలకు లోక్ సభ వాయిదా వేసిన స్పీకర్

హైదరాబాద్:రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ..ఇవాళ పార్లమెంటు వద్ద జై భీమ్, ఐయామ్ అంబేద్కర్ ప్లకార్డులతో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు.  అదే సమయంలో పార్లమెంటుకు వచ్చిన బీజేపీ ఎంపీలు ప్రతిగా నినాదాలు చేశారు. 

వారిని సభలోకి వెళ్లకుండా కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకున్నారు.. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ  ప్రతాప్ సారంగి కింద పడ్డాడు. ఆయన తలకు గాయమైంది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయించారు. 

రాహుల్ గాంధీ నెట్టేశారు

గాయపడిన ఒడిశా ఎంపీ  ప్రతాప్ సారంగిని రాహుల్ గాంధీ కావాలనే నెట్టేశారని బీజేపీ ఆరోపించింది. తమను సభలోకి ప్లకార్డులతో అనుమతించనందునే బయట నిరసన తెలుపుతున్నామని కాంగ్రెస్ తెలిపింది. రాహుల్ గాంధీ నెట్టేయలేదని, తోపులాటలో కింద పడ్డారని అంటోంది. కేంద్రమంత్రి అమిత్ షా మాటలను కాంగ్రెస్ నేతలు వక్రీకరించారని, చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు.

ALSO READ | ఎంతో చేశాం.. ఎన్నో చేశాం.. అయినా తప్పుడు వ్యక్తులుగా మారాం: మాల్యా, లలిత్ మోడీ X డిస్కషన్

మాణిక్కం వాయిదా తీర్మానం

రాజ్యసభలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చర్చ జరపాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ లోక్ సభలో ఇవాళ వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనికి స్పీకర్ అనుమతించలేదు. సభ్యులు లోనికి వెళ్లి అమిత్ షా రాజీనామా చేయాలని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. దీంతో  సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో  స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 

సభలోకి వెళ్తుంటే అడ్డుకున్నరు: రాహుల్

 బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి తలకు గాయం కావడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్  రియాక్ట్ అయ్యారు. " నేను పార్లమెంట్ లోకి వెళ్తున్నాను. బీజేపీ ఎంపీలు నన్ను ఆపేందుకు ప్రయత్నించారు. తర్వాత వారు నన్ను వెనక్కి నెట్టారు. కానీ నాకేం కాలేదు. కానీ సభలోకి వెళ్లేందుకు ఓ సభ్యుడిగా నాకు హక్కు ఉంది. కానీ బీజేపీ నేతలు నన్ను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రతాప్ సారంగికి గాయమైంది" అని చెప్పారు.