గన్స్ వదిలేసిన మణిపూర్ రెబెల్ గ్రూప్ .. కేంద్రంతో యూఎన్ఎల్ఎఫ్ శాంతి ఒప్పందం: అమిత్ షా  

గన్స్ వదిలేసిన మణిపూర్ రెబెల్ గ్రూప్ .. కేంద్రంతో యూఎన్ఎల్ఎఫ్ శాంతి ఒప్పందం: అమిత్ షా  
  • 60 ఏండ్ల గెరిల్లా పోరాటం ముగిసిందని కామెంట్ 

న్యూఢిల్లీ :  రెండు వర్గాల మధ్య అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ లో కీలకమైన ఓ రెబెల్ గ్రూపు హింసకు స్వస్తి పలుకుతూ ఆయుధాలు విడిచిపెట్టింది. స్వతంత్ర మణిపూర్ దేశం కోసం సాయుధ పోరాటం చేస్తున్న యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ఎల్ఎఫ్​) శాంతి ఒప్పందంపై సంతకం చేసినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందంపై యూఎన్ఎల్ఎఫ్ సంతకం చేయడంతో మణిపూర్ లో 60 ఏండ్ల గెరిల్లా పోరాటం ముగిసినట్లయిందని ఆయన అన్నారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ–ఉపా) కింద యూఎన్ఎల్ఎఫ్ పై గతంలోనే నిషేధం ఉండగా.. కేంద్రం ఇటీవల మరో ఐదేండ్లు పొడిగించింది. శాంతి ఒప్పందం దిశగా రెబెల్ గ్రూపుతో చర్చలు జరుపుతున్నట్లు ఇటీవల మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ, మణిపూర్ ప్రభుత్వ అధికారులు, యూఎన్ఎల్ఎఫ్ ప్రతినిధులు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. 

60 ఏండ్ల పోరాటానికి తెర..  

ఈశాన్య రాష్ట్రాల్లోని ఇతర మిలిటెంట్ గ్రూపులు ఇదివరకే శాంతి ఒప్పందాలు చేసుకుని హింసకు ముగింపు పలికాయని, ఇప్పుడు యూఎన్ఎల్ఎఫ్ కూడా అగ్రిమెంట్ చేసుకోవడం చరిత్రాత్మక ఘట్టమని అమిత్ షా ట్వీట్ చేశారు. ‘‘ఈశాన్యంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనం. హింసను విడనాడి, జనజీవన స్రవంతిలో కలిసేందుకు యూఎన్ఎల్ఎఫ్ ముందుకు రావడం పట్ల చాలా సంతోషిస్తున్నా.

వారి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా” అని ఆయన పేర్కొన్నారు. కాగా, యూఎన్ఎల్ఎఫ్ 1964లో ఏర్పాటైంది. ఇప్పటివరకూ కొండ ప్రాంతాల్లోని కుకీల ప్రాబల్యం ఉన్న 21 రెబెల్స్ గ్రూపులు తుపాకులు విడిచిపెట్టగా.. లోయ ప్రాంతంలోని మైతీల ప్రాబల్యం ఉన్న రెబెల్ గ్రూపు శాంతి బాట పట్టడం ఇదే మొదటిసారి. యూఎన్ఎల్ఎఫ్ లొంగుబాటుతో మణిపూర్ లోని ఇతర రెబెల్ గ్రూపులు కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.