రాయ్‌బరేలీ : కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను కొన్ని దశాబ్దాల పాటు దోచుకున్నదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో ఎన్నో ఏండ్ల కల నెరవేరిందని తెలిపారు. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకను కూడా కాంగ్రెస్ రాజకీయం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్‌వి అన్నీ ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలే అని మండిపడ్డారు. అమేథీ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి స్మృతి ఇరానీ, రాయ్‌బరేలీ అభ్యర్థి దినేశ్ ప్రతాప్ సింగ్ తరఫున అమిత్ షా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాయ్‌బరేలీలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘స్మృతి ఇరానీ, దినేశ్ ప్రతాప్ సింగ్ కష్టపడి పని చేసేవాళ్లు. ఇద్దరినీ భారీ మెజారిటీతో గెలిపించండి. అయోధ్యలో మనం బాలరాముడి ఆలయం కట్టుకోవడం కాంగ్రెస్‌కు నచ్చలేదు. సరైన పద్ధతిలో ప్రాణ ప్రతిష్ఠ జరగలేదని అంటున్నరు. కాంగ్రెస్ చేసేవన్నీ కుటుంబ రాజకీయాలే. లాలూ ప్రసాద్ యాదవ్ ఏమో తన కొడుకు సీఎం కావాలనుకుంటడు. మమతా ఏమో తన మేనల్లుడిని సీఎం చేయాలనుకుంటరు. సోనియా ఏమో రాహుల్‌ను ప్రధాని చేయాలనుకుంటరు. ఇండియా కూటమి నేతలు చేసేదంతా పరివార్వాద్ రాజకీయాలు. రాయ్‌బరేలీ, అమేథీలో ఎవరిని గెలిపించాలో.. ఎవరిని ఇంటికి పంపించాలో డిసైడ్ చేసేది ప్రజలు.
రాయ్‌బరేలీ, అమేథీ గాంధీ ఫ్యామిలీ సీట్లు అని ప్రియాంక గాంధీ ఎలా అంటారు? ఇక్కడ ఏ సీటు గాంధీ కుటుంబం కోసం రిజర్వ్ చేసిలేదు’’అని అమిత్ షా అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నదని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను దోచుకున్న వారందరినీ మోదీ ప్రభుత్వం జైల్లో పెట్టిందని అన్నారు. యూపీలో మళ్లీ వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే అని ధీమా వ్యక్తం చేశారు. మోదీ హయాంలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో ఉన్న గూండాలందరినీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరిమికొట్టారని తెలిపారు.
