మెదక్ జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువ

  • జీపీ ఎన్నికల్లో గెలుపు ఓటములు నిర్ణయించేది వారే
  • గ్రామ పంచాయతీల ఫైనల్ ​ఓటర్​లిస్ట్ ​విడుదల 

మెదక్​, సిద్దిపేట, వెలుగు: సవరణల అనంతరం గ్రామ పంచాయతీల ఫైనల్ ఓటర్ లిస్ట్ విడుదలైంది. మెదక్ జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సంఖ్యా పరంగా ఎక్కువగా ఉండడం, గడిచిన ఎన్నికల్లో మహిళా ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడాన్ని పరిశీలిస్తే  రానున్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల​గెలుపు ఓటములను మహిళా ఓటర్లే నిర్ణయించనున్నట్లు అర్థమవుతోంది. జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 491 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలో 4,232  వార్డులు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఈ నెల 14న విడుదల చేశారు.  మార్పులు, చేర్పుల అనంతరం 28న ఫైనల్​ ఓటర్​ లిస్ట్​ విడుదల చేశారు. దీని ప్రకారం జిల్లా వ్యాప్తంగా 491 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 5,12,277 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో అత్యధికంగా మహిళా ఓటర్లు 2,65,454 మంది ఉండగా, పురుషులు 2,46,814 మంది, ట్రాన్స్​జెండర్లు 9  మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ ఆఫీస్ ల వద్ద గ్రామ పంచాయతీ ఫైనల్ ఓటర్​లిస్ట్​లను ప్రచురించారు.

సిద్దిపేటలో..

సిద్దిపేట: సిద్దిపేటలో సైతం పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో వీరి ఓట్లే కీలకం కానున్నాయి. జిల్లాలో మొత్తం 491 గ్రామ పంచాయతీలు ఉండగా వాటి పరిధిలో 4,350  వార్డులు ఉన్నాయి. మొత్తం 6,14,371 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,02,321, మహిళలు 3,12,043, ఇతరులు 7 గురు ఉన్నారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే మహిళలు 9722 ఎక్కువగా ఉన్నారు. కాగా సాంకేతిక కారణాలతో సిద్దిపేట మండలంలో15 గ్రామ పంచాయతీలు, 8 మల్లన్న సాగర్ ముంపు పంచాయతీల ఓటర్ల జాబితాలను పెండింగ్​లో పెట్టారు.