ఏపీలో ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019 ఎన్నికల్లో సాధించిన మెజారిటీకి ఏ మాత్రం తగ్గకుండా ఈ సారి ఎన్నికల్లో గెలవాలని అధికార వైసీపీ భావిస్తుండగా, ఎలా అయినా జగన్ గద్దె దించటమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నాయి టీడీపీ, జనసేన పార్టీలు. సుదీర్ఘకాలం తర్జనభర్జనల తర్వాత కూటమి మధ్య పొత్తు అయితే కుదిరింది కానీ, పార్టీల నేతల మధ్య సమన్వయము అయితే ఇంకా కుదిరినట్లు కనిపించట్లేదు. పొత్తులో భాగంగా సీటు కోల్పోయిన మూడు పార్టీల నేతలు అసమ్మతి స్వరం వినిపిస్తూనే ఉన్నారు.
తాజాగా బీజేపీ సీనియర్ నాయకుడు అంబికా కృష్ణ పొత్తు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పొత్తు వల్ల బీజేపీకి రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరిగిందని, ఏపీలో ఏ పార్టీతో పొత్తు వద్దని బీజేపీ కార్యకర్తలు సంతకాలు చేసి అధిష్టానానికి పంపారని ఆ లేఖను తుంగలో తొక్కారని అన్నారు.నిజమైన బీజేపీ నాయకులు ఒక్కరికి కూడా టికెట్ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో పొత్తు చీలిపోయిందని, టీడీపీ అభ్యర్థులకు బీజేపీ కార్యకర్తలు సహకరించే పరిస్థితి లేదని అన్నారు. ఈ క్రమంలో పొత్తుపై అంబికాకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.