భారత్​ జల్​శక్తి, డ్యామ్​ల వెనుక అంబేద్కర్​ ఘనత

  • కాంగ్రెస్ పార్టీ ఆయన కృషిని గుర్తించలే: ప్రధాని నరేంద్ర మోదీ
  • నీటి సంరక్షణనూ ఆ పార్టీ ఎన్నడూ పట్టించుకోలే
  • 21 శతాబ్దంలో నీటివనరులున్న దేశాలే ముందుకెళ్తాయి
  • మధ్యప్రదేశ్​లో కెన్‌‌-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన

భోపాల్: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జల్‌‌శక్తిపై ఎవరు పనిచేశారనేది ఇన్నిరోజులు దాచిపెట్టారని, భారత జల్‌‌శక్తి, డ్యామ్‌‌ల వెనుక డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ ఘనత ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. ఈ విషయంలో ఆయనను కాంగ్రెస్ ఏనాడూ గుర్తించలేదని విమర్శించారు. నీటి సంరక్షణను ఆ పార్టీ నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. 

మధ్యప్రదేశ్​లోని ఖజురహోలో కెన్​బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు బుధవారం ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ వరుసగా బెత్వా, కెన్ నదుల నీళ్లున్న కలశాలను అందజేయగా.. ఆయన ప్రాజెక్టు నమూనాలో పోశారు.  ఖండ్వా జిల్లాలోని ఓంకారేశ్వర్​ ఫ్లోటింగ్​ సోలార్​ ప్రాజెక్ట్​ను  ప్రారంభించారు. 

అంతకు ముందు మాజీ ప్రధాని అటల్‌‌ బిహారీ వాజపేయి పేరిట తపాల బిళ్ల, రూ.100 నాణేన్ని  విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మోదీ మాట్లాడారు. దేశాభివృద్ధిలో ఏబీ వాజ్​పేయీ కీలక పాత్ర పోషించారని చెప్పారు. వాజపేయి ప్రభుత్వం నీటిపారుదల అవసరాలతో పాటు వరదలను ఎదుర్కోవడానికి నదుల అనుసంధానాన్ని ఒక పరిష్కారంగా ప్రతిపాదించిందని తెలిపారు. సుశాసన్​ దినోత్సవం అనేది తమ ప్రభుత్వానికి ఒక్కరోజు 
కార్యక్రమం కాదని, అది తమకు గుర్తింపు అని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో నీటివనరులున్న దేశాలే అభివృద్ధిలో ముందుకుసాగుతాయని చెప్పారు.

నీటి అవసరాలను కాంగ్రెస్ ఏనాడూ​ పట్టించుకోలే

డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ దార్శనికత, దూరదృష్టి దేశ వనరుల బలోపేతానికి, వాటి నిర్వహణకు, డ్యామ్​ల నిర్మాణానికి దోహదపడ్డాయని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని మేజర్​ రివర్​ వ్యాలీ ప్రాజెక్ట్స్, సెంట్రల్​ వాటర్​ కమిషన్​ అభివృద్ధిలో అంబేద్కర్​ కీలక పాత్ర పోషించారని చెప్పారు. అయితే, దేశంలో పెరుగుతున్న నీటి సంరక్షణ అవసరాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ పట్టించుకోలేదని, నీటి సంరక్షణ వాదిగా అంబేద్కర్ చేసిన కృషిని ఎన్నడూ గుర్తించలేదని మోదీ అన్నారు. ఏండ్ల క్రితం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను కూడా కాంగ్రెస్​ తన హయాంలో పూర్తిచేయలేకపోయిందని, కొన్ని ప్రాజెక్టులను 35–40 ఏండ్లపాటు జాప్యం చేసిందని మండిపడ్డారు. కేవలం అభివృద్ధి ప్రకటనలకు మాత్రమే ఆ పార్టీ హడావుడి చేసేదని అన్నారు. 

కాంగ్రెస్, గవర్నెన్స్​ కలిసి సాగవని చురకలంటించారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా తమ సర్కారు ముందుకుపోతున్నదని తెలిపారు. మధ్యప్రదేశ్​లో తమ ప్రభుత్వానికి ఏడాది పాలన పూర్తయిందని, ఈ కాలంలో అభివృద్ధికి కొత్త దిశ లభించిందని తెలిపారు. రూ. వేల కోట్ల విలువైన కార్యక్రమాలు మొదలయ్యాయని తెలిపారు. కెన్​బెత్వా నదుల అనుసంధానం బుందేల్​ఖండ్​ ప్రాంతంలో సంతోషానికి కొత్త తలుపులు తెరుస్తుందని చెప్పారు.