ముందుగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పై కేసులు పెట్టాలి: అంబటి రాంబాబు సంచలన ట్వీట్

ఏపీలో ప్రస్తుతం సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల పర్వం నడుస్తోంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే టార్గెట్ గా అరెస్టులు చేపట్టింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వరుసగా అరెస్టు చేశారు పోలీసులు. కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందంటూ ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు సంచలన ట్వీట్ చేశారు.

అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసులు పెడితే ముందుగా.. ప్రస్తుత స్పీకర్ పైనా, డిప్యూటీ స్పీకర్ పైన కేసులు పెట్టి అరెస్టు చేయాలంటూ ట్వీట్ చేశారు అంబటి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం జగన్ ను ఉద్దేశించి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమారాజు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు అంబటి రాంబాబు.

మరో ట్వీట్లో.. శాసనసభలో లోకేష్ తల్లి గారిని అవమానించినట్లు నిరూపిస్తే.. భేషరతుగా క్షమాపణ చెప్పి, రాజకీయ నిష్క్రమణ చేస్తానంటూ చెప్పుకొచ్చారు అంబటి. మంత్రి నారా లోకేష్ గురువారం ( నవంబర్ 14, 2024 ) శాసనమండలిలో మాట్లాడుతూ తన తల్లిని అవమానించిన వారికి వైసీపీ టికెట్ ఇచ్చారంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈ ట్వీట్ చేశారు అంబటి. మొత్తానికి అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య సోషల్ మీడియా యుద్ధం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.