న్యూఢిల్లీ : మీ ఇంటి పక్కనున్న కిరాణా దుకాణంలో వస్తువులేమన్నా.. మీకు కావాలా..? కానీ బయట వర్షమో లేదా మరే ఇతర కారణాలతోనైనా తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉందా..? అయితే అమెజాన్‌లో ఆర్డర్ ఇచ్చేయండి. మీ పక్క దుకాణంలో మీకు కావాల్సిన వస్తువు అమెజాన్ ద్వారా క్షణాల్లో వచ్చి మీముందు ఉంటుంది. దీని కోసం కిరాణా స్టోర్లను తన ప్లాట్‌ఫామ్‌పై యాడ్ చేస్తోంది అమెజాన్. రిటైల్ స్ట్రాటజీలో భాగంగా కిరాణా స్టోర్లలోకి కూడా చొచ్చుకుని పోయేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలయన్స్ రిటైల్ ఇదే స్ట్రాటజీని ప్రకటించింది. తన కొత్త ఈ–కామర్స్ ఛానల్‌లో భాగంగా లక్ష కొద్దీ షాపులను చేరుకోవడమే తన లక్ష్యమని రిలయన్స్ చెప్పింది. సేమ్ టూ సేమ్ రిలయన్స్ లాగానే… అమెజాన్ కూడా వడివడిగా అడుగులు వేస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ముందుగా స్మాల్ మొబైల్‌ఫోన్ సెల్లర్లు..
తమ ప్లాట్‌ఫామ్ ద్వారా వస్తువులను విక్రయించడానికి వేల కొద్దీ కిరాణా దుకాణాలు సైనప్ అవనున్నాయని అమెజాన్ వర్గాలు చెప్పాయి. ముందుగా అమెజాన్ స్మాల్ మొబైల్ ఫోన్ సెల్లర్స్ నుంచి ఈ కార్యక్రమానికి స్వీకారం చుడుతోంది. వారిని తన ప్లాట్‌ఫామ్‌పై ఎన్‌రోల్ చేసుకునేలా ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత వీటిని ఫుడ్ నుంచి మెర్చండైజ్ వరకు విస్తరించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికోసం అమెజాన్ బెంగళూరుకు చెందిన స్టార్టప్ షాప్‌ఎక్స్ తో కూడా టైఅప్ అయింది. ఇది కిరాణాలను పెద్ద పెద్ద రిటైలర్లు, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలతో డిజిటల్‌గా కనెక్ట్ చేస్తుంది. అమెజాన్‌ఈజీ, ఐ హ్యావ్ స్పేస్, సర్వీస్ పార్టనర్ ప్రొగ్రామ్, వంటి పలు ప్రొగ్రామ్‌లతో కిరాణా స్టోర్లను చేరుకుంటున్నా రు. ఈ ఎకోసిస్టమ్‌లో ఎప్పటికీ కొత్తదనాన్ని అందించడమే తమ లక్ష్యమని అన్నారు. ఫ్లిప్‌కార్ట్ కూడా ఈ ఏడాది మే నెలలోనే ఇలాంటి సేవలను పైలెట్ బేసిస్‌లో ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొబైల్ ఫోన్లను అమ్ముకునేందుకు వీలుగా తెలంగాణలో 800 మంది చిన్న దుకాణదారులతో జతకట్టింది.
650 బిలియన్ డాలర్లుగా రిటైల్ మార్కెట్..
ఇండియాలో ఈ–కామర్స్ మార్కెట్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. మొత్తం రిటైల్ మార్కెట్ 650 బిలియన్ డాలర్లలో 10 శాతం మాత్రమే ఈ–కామర్స్ తో కలిసి ఉన్న మోడ్రన్ రిటైలర్స్‌ది. కిరాణాలతో ఈ–కామర్స్ కంపెనీలు కలిస్తే.. రెండూ అభివృద్ధి చెందుతాయని రిటైల్ కన్సల్టెన్సీ థర్డ్ ఐసైట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవాంన్షు దత్తా అన్నారు.
మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
