వామ్మో ఇలా చనిపోతున్నారేంటి..? ఫ్రెండ్ పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ.. కర్నూలు జిల్లాలో విషాద ఘటన

కర్నూలు: ఒకప్పుడు గుండెపోటు అంటే వయసు పైబడిన వారికే అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పట్టుమని పాతికేళ్లు నిండకుండానే నూరేళ్ల జీవితం అర్థాంతరంగా ముగిసిపోతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నాయి. ఆడుతూపాడుతూ ఎంజాయ్ చేస్తూ సడన్గా గుండె పట్టుకుని కుప్పకూలిపోతున్నారు. సెకన్ల వ్యవధిలోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో తాజాగా వెలుగుచూసింది. ఫ్రెండ్ పెళ్లికి వెళ్లిన ఓ యువకుడు తన స్నేహితుడికి కానుక ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటన కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో జరిగింది. బెంగళూరులో అమెజాన్ కంపెనీలో జాబ్ చేస్తున్న వంశీ అనే యువకుడు తన ఫ్రెండ్ పెళ్లికెళ్లాడు. ఫ్రెండ్స్ అందరితో కలిసి సరదాగా ఎంజాయ్ చేశాడు. ఫ్రెండ్ పెళ్లికి తీసుకొచ్చిన గిఫ్ట్ ఇస్తూ పెళ్లి మండపంపైనే కుప్పకూలి చనిపోయాడు. అతని ప్రాణాలు కాపాడేందుకు వంశీని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తోటి స్నేహితులు హుటాహుటిన తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే గుండెపోటుతో వంశీ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

30 నుంచి 50 ఏళ్ల వయసున్న ప్రతీ నలుగురు భారతీయులు గుండె నొప్పితో బాధపడడం అందర్నీ ఆందోళన కలిగించే విషయం. ఇటీవల కాలంలో చాలా మంది ఎందుకు గుండెపోటు బారిన పడుతున్నారు ? ఎందుకు అది మృత్యు ఒడికి చేరుస్తోంది ? అనే విషయాలను గమనిస్తే.. చాలా మంది చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. రావల్సిన దానికన్నా 8 - 10 సంవత్సరాల ముందే ఈ వ్యాధులు అటాక్ కావడం అందర్నీ ఆందోళన కలిగిస్తోంది. అందులోనూ దక్షిణాది ప్రజలకు ఎక్కువగా హై బీపీ, ఎక్కువ కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిక్స్ ఉండడం, ఉండాల్సిన దానికన్నా తక్కువ బరువును కలిగి ఉండడం వలన గుండెకు సంబంధించిన డిసీజెస్ అటాక్ అవుతున్నాయని సమాచారం.

జీవనశైలిలో మార్పులూ పలు వ్యాధులకు కారణాలుగా తెలుస్తోంది . ఎక్కువ ఉప్పు, ఎక్కువ తీపితో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిల్వకు దారితీస్తుంది. ఫలితంగా హైపర్ టెన్షన్..అంటే రక్తపోటును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది గుండెపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. వీటన్నింటికి తోడు నిద్ర లేమి, వ్యాయామం చేయకపోవడం, బరువు పెరగడం, ఒత్తిడి పెరగడం, డయాబెటిక్స్ లాంటి వన్నీ కూడా గుండెకు హాని కలిగించేవేనని పలువురు హెచ్చరిస్తున్నారు. దీని ఫలితంగా కూడా గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.