ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ విస్తరణ
హైదరాబాద్, వెలుగు : దేశంలో అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ విస్తరణ కోసం జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సిటీతో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సెంటర్ ప్రస్తుతం 4 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. మరో లక్షా 80 వేల చదరపు అడుగుల్లో దీన్ని విస్తరించనున్నారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌తో అమెజాన్.ఇన్‌కు మన రాష్ట్రంలో 3 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు 8 లక్షల 50 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉండనున్నాయి. తమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డెలివరీ నెట్‌వర్క్‌పై పెట్టుబడులు పెట్టడాన్ని స్థిరంగా కొనసాగిస్తున్నామని, దీంతో తమ డెలివరీ స్పీడ్‌ను పెంచి, కస్టమర్లకు, అమ్మకందారులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తున్నామని అమెజాన్, కస్టమర్ ఫుల్‌ఫిల్‌మెంట్–ఆసియా వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా చెప్పారు.
తమ అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను విస్తరించడంతో, ఈ ప్రాంతంలో వందల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడం, వేలమంది స్థానిక అమ్మకం దారులను ప్రోత్సహించడం చేస్తున్నామని అన్నారు. తమతో సంబంధాలను అమెజాన్ మరింత పెంచుకోవడం ఆనందదాయకంగా ఉందని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ ల్యాండ్ డెవలప్‌మెంట్ సీఈవో అమన్ కపూర్ అన్నారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సిటీలో అమెజాన్ మరింత అభివృద్ధి చెందుతుందని తాము భావిస్తున్నట్టు చెప్పారు. ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ విస్తరణతో స్థానికులకు ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా.. రాష్ట్రంలో, దేశంలో స్కిలింగ్‌ను మెరుగుపరచనుంది. తెలంగాణలో 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద డెలివరీ స్టేషన్‌ను ఇటీవలే అమెజాన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
