నార్మన్ పోస్టర్స్ సంస్థకు దక్కిన అమరావతి భవనాల డిజైన్ల టెండర్

ఏపీ రాజధాని అమరావతిలో ఐదు ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్ల టెండర్ నార్మన్ పోస్టర్ సంస్థకు దక్కిందని మంత్రి నారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంటులో కేంద్రం గతంలోనే స్పష్టంగా చెప్పిందని.. దీనికి సంబంధించి కేంద్రం అధికారిక గెజిట్‎ను జారీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. అమరావతిలో నిర్మించనున్న ఐదు ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లను నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించిందన్నారు. 

గత వైసీపీ ప్రభుత్వం నార్మన్ పోస్టర్స్ సంస్థ టెండర్‎ను, వారి డిజైన్లను రద్దు చేసిందని.. అందుకే మళ్లీ ఈ భవనాల డిజైన్ల కోసం టెండర్లు పిలిచామని.. ఆ టెండర్లు కూడా నార్మన్ పోస్టర్స్ సంస్థకే దక్కాయని వెల్లడించారు. జగన్ సర్కార్ ఎలాంటి నోటీసు లేకుండా టెండర్లు రద్దు చేయటంతో నార్మన్ పోస్టర్స్ ఆర్బిట్రేషన్ కేంద్రంలో కంప్లైంట్ చేసిందని.. దీంతో ఆ సంస్థకు రూ.9 కోట్లు చెల్సించాల్సి వచ్చిందని తెలిపారు. 

సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించిన డిజైన్లకు ఆమోదం తెలిపామని.. త్వరలోనే వీటి తుది డిజైన్లకు సంబంధించిన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించి పనులు త్వరలోనే మొదలు అవుతాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు రుణానికి ఎలాంటి ఇబ్బంది లేదని, దశలవారీగా రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే ముందుకు వచ్చిందని తెలిపారు.