ప్లీజ్.. కాస్త ఓపిక పట్టండి.. అల్లు అర్జున్ ఇంటి మీద దాడిపై అల్లు అరవింద్ స్పందన

హైదరాబాద్: జూబ్లీహిల్స్‎లోని అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం (డిసెంబర్ 22) రాత్రి బన్నీ నివాసం దగ్గర అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఇవాళ (డిసెంబర్ 22) మా ఇంటి దగ్గర జరిగిన ఘటన అందరూ చూశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాం.. మా కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు అరవింద్. మా ఇంటి దగ్గర మళ్లీ ఎవరు గొడవ చేసినా వాళ్ళను తీసుకెళ్ళేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని.. అరెస్ట్ తప్పదని హెచ్చరించారు. 

ఎవరు ఇలాంటి దుశ్చర్యలకు ప్రేరేపించకూడదని కోరారు. ప్రస్తుతం ఈ అంశంపై సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని.. కాస్తా ఓపికగా ఉండాలని అభిమానులకు సూచించారు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని ఈ మేరకు అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు. కాగా, పుష్ప 2  ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విసయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్‎ను అరెస్ట్ చేయగా.. నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వెంటనే బన్నీ హై కోర్టును ఆశ్రయించగా అక్కడ ఊరట లభించింది. ఈ కేసులో అల్లు అర్జున్‎కు హై కోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్ర ఆగ్రహం ఉంది. అల్లు అర్జున్ బాధ్యతరాహిత్యం వల్లే తొక్కిసలాట జరిగి ఓ మహిళా ప్రాణాలు కోల్పోయిందని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 

తనపై  తప్పుడు ఆరోపణలు చేశారని.. పోలీసులు అనుమతితోనే థియేటర్‎కు వెళ్లానని.. సినిమా చూసే సమయంలో మహిళా మృతి చెందిందన్న విషయం తనకు తెలియదని బన్నీ అతడి వెర్షన్ చెప్పాడు. దీంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా అటు సినీ ఇటు పొలిటికల్ సర్కిల్స్‎లో దుమారం రేపుతోంది. ఈ క్రమంలో బన్నీ ఇంటి ముందు ఓయూ జేఏసీ ఆదివారం ఆందోళనకు దిగింది. బన్నీ ఇంట్లోకి రాళ్లు రువ్వడంతో పాటు పూల కుండీలు ధ్వంసం చేశారు. తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని.. మృతురాలి ఫ్యామిలీకి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.