శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

  • కేసు కోర్టులో ఉన్నందున  బన్నీ రాలేకపోయాడని ప్రకటన

సికింద్రాబాద్, వెలుగు: పుష్ప–2 బెనిఫిట్ షో టైంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నిర్మాత, అల్లు అర్జున్​తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు. బుధవారం కిమ్స్ కు వచ్చి శ్రీతేజ్ కుటుంబ సభ్యులను కలిశారు. బాబు గురించి తెలుసుకున్నారు. కేసు కోర్టులో ఉన్నందున బన్నీ(అల్లు అర్జున్) శ్రీతేజ్​ను చూసేందుకు రాలేకపోయాడని వారితో చెప్పారు. అల్లు అర్జున్ తరఫున తాను వచ్చి బాబును పరామర్శించి ఆరోగ్యం గురించి డాక్టర్లతో మాట్లాడానన్నారు.

 అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన విషాదకరమైనదన్నారు. రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలుకోవాలని భగవంతుని వేడుకుంటున్నట్లు వెల్లడించారు. ఇది ఇలా ఉండగా శ్రీతేజ్ ఆరోగ్యంపై కిమ్స్ దవాఖాన డాక్టర్లు హెల్త్ బులిటెన్ మంగళవారం రాత్రి విడుదల చేశారు. శ్రీ తేజ్ మెదడు లో రక్త ప్రసరణ సమస్యలున్నాయని, ప్రస్తుతం ఆయన కు ట్యూబ్ ద్వారా ఫీడ్ అందిస్తూ వెంటిలేటర్ పై చికిత్స కొనసాగిస్తున్నట్లు డాక్టర్లు చేతన్, విష్ణుతేజ తెలిపారు.