శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలి.. రేవతి ఫ్యామిలీకి అండగా ఉంటా: అల్లు అర్జున్ ప్రకటన

హైదరాబాద్: సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అల్లు అర్జున్ స్పందించారు. ఈ మేరకు ఆదివారం (డిసెంబర్ 15) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బన్నీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తు్న్నానని అన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున చట్టపరమైన కారణాల వల్ల ఈ సమయంలో శ్రీ తేజ్‌ను, అతన్ని కుటుంబాన్ని కలవలేకపోతున్నాను.. అతి త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తానన్నారు బన్నీ.

శ్రీ తేజ్ వైద్య,  కుటుంబ అవసరాలకు నేను బాధ్యత వహిస్తున్నానని మరోసారి ప్రకటించారు స్టైలిస్ స్టార్. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‎లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేందుకు బన్నీ సంధ్య థియేటర్‎కు వెళ్లగా బన్నీ చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది.

ALSO READ | నా ఫ్యామిలీని హత్య చేసేందుకు కుట్ర: విష్ణుపై ఫిర్యాదు చేసిన మనోజ్

ఈ ఘటనలో కుటుంబంతో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే శ్రీ తేజ్ హెల్త్ కండిషన్‎పై బన్నీ ఆరా తీసి పోస్ట్ పెట్టారు. ఇక, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‎పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బన్నీ జైలు నుండి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.