సీఎం రేవంత్‎కు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అల్లు అర్జున్ తప్పుబట్టడం సరికాదని.. అల్లు అర్జున్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి నటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని సూచించారు. 2024, ఆదివారం 22న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎదురు దాడిగా నటుడు అల్లు అర్జున్ మాట్లాడటం సరికాదని అన్నారు. 

తొక్కిసలాటపై అసెంబ్లీ తన ఇమేజ్ దెబ్బ తీశారని అల్లు అర్జున్ అంటున్నారు.. కానీ సీఎం వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడలేదని.. ఆ రోజు జరిగిన ఘటనను పూర్తిగా వివరించి చెప్పారన్నారు. మృతురాలు రేవతి కుటుంబాన్ని, ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాలుడు శ్రీ తేజ్‎ను పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదని అల్లు అర్జున్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలీసులు వద్దని చెప్పినా అల్లు అర్జున్ రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని.. పోలీసులతో అల్లు అర్జున్‌ దురుసుగా ప్రవర్తించాడన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన వెళ్లి   కనీసం బాధితులను పరామర్శించలేదన్నారు. ఇక నుండి తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని మంత్రి తేల్చి చెప్పారు. త్వరలోనే సినీ ఇండస్ట్రీ పెద్దలతో భేటీ అయ్యి చర్చిస్తామని తెలిపారు. 

కాగా, పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. అల్లు అర్జున్ బాధ్యతారహిత్యం వల్లే తొక్కిసలాట జరిగి ఓ మహిళ ప్రాణాలు విడిచింది.. ఆమె కుమారుడు ప్రాణప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు సీఎం రేవంత్. థియేటర్‎కు వెళ్లేందుకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా అల్లు అర్జున్ రోడ్ షో చేసుకుంటూ రావడంతోనే తొక్కిసలాట జరిగిందన్నారు. ఒక్క రాత్రి జైల్లో ఉన్న అల్లు అర్జున్ కు ఏమో అయినట్లు  ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటికి క్యూ కట్టి సంఘీభావం తెలిపారు. 

తొక్కిసలాటలో చనిపోయిన బాధిత కుటుంబాన్ని, ఆసుప్రతిలో చికిత్స పొందుతోన్న ఆమె కుమారుడిని ఆసుపత్రికెళ్లి ఒక్క సినీ ప్రముఖుడు పరామర్శించలేదని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ గా  అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తనపై అన్ని తప్పుడు ఆరోపణలు చేశారని.. తన క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసుల అనుమతితోనే థియేటర్‎కు వెళ్లానని నొక్కి చెప్పారు. కేసు కోర్టులో ఉండటంతోనే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లలేదని సీఎం వ్యాఖ్యలకు కౌంటర్‎గా ప్రెస్ మీట్‎లో వెల్లడించాడు బన్నీ.