రేవతి ఫ్యామిలీకి అల్లు అర్జున్​ రూ.20 కోట్లివ్వాలి: ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్​ గజ్జెల కాంతం 

పంజాగుట్ట, వెలుగు: సంధ్య థియేటర్​ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి సినీ హీరో అల్లు అర్జున్​రూ.20 కోట్లు నష్టపరిహారంగా ఇవ్వాలని కాంగ్రెస్​ నాయకుడు, ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ ​గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. సోమవారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. రేవతి మృతికి బాధ్యుడైన అల్లు అర్జున్​కు గతంలో కేంద్రం ఇచ్చిన నేషనల్​అవార్డును రద్దు చేయాలని డిమాండ్​చేశారు. ఈ విషయమై ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు.

ఒకరు చనిపోయి, ఇంకొకరు మృత్యువుతో పోరాడుతున్నా అల్లు అర్జున్​లో మానవత్వం ఎక్కడా కానరాలేదన్నారు. ఈ అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చిన సమయంలో సీఎం వివరాలు వెల్లడిస్తే.. అల్లు అర్జున్ కౌంటర్​గా ప్రెస్​మీట్​పెట్టారని మండిపడ్డారు. ఆయన వెనుక బీఆర్ఎస్​నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు ఉన్నారని, వారి అండ చూసుకునే సీఎంకు కౌంటర్​ఇచ్చారని ఆరోపించారు. అల్లు అర్జున్​రేవతి కుటుంబానికి రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకుంటే ఫిలించాంబర్​ను వేలాది మందితో  ముట్టడిస్తామని హెచ్చరించారు.