అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలింపు

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన చిక్కడ పల్లి పోలీసులు.. అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కేసు తీవ్రత దృష్ట్యా నాంపల్లి కోర్టు.. అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో, పోలీసులు అతన్ని చంచల్ గూడ జైలుకు  తరలిస్తున్నారు.

అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించే ముందు.. నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. తొక్కిసలాటకు.. అల్లు అర్జున్ కు ప్రత్యక్షంగా సంబంధం లేదని.. తనపై ఉన్న FIR కొట్టివేయాలని అతని తరపు న్యాయవాది వాదించారు. కేసులో ఏ 11గా ఉన్నారని.. ఈ విషయంలో ప్రత్యక్షంగా కానీ .. పరోక్షంగా కానీ ఎకలాంటి సంబంధం లేదంటూ అతని తరపు లాయర్లు వాదించారు. 

దీనిపై పోలీసులు సైతం బలంగా వాదనలు వినిపించారు. పోలీసుల అనుమతి లేకుండా థియేటర్ దగ్గరకు వచ్చారని.. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని.. హీరో అల్లు అర్జున్ రావటం వల్లే ఒకరు చనిపోయారని.. దీనికి కారణం అల్లు అర్జున్ అంటూ పోలీసుల తరపు వాదనలు వినిపించారు లాయర్లు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్ కు ఈ నెల డిసెంబర్ 27 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చింది. అంతకుముందు పోలీసులు అల్లు అర్జున్‌కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. 

డిసెంబర్‌ 4న రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి (39) అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పలువురిపై కేసు నమోదు చేసిన చిక్కడ పల్లి పోలీసులు.. శుక్రవారం (డిసెంబర్ 13) అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా రావటం.. ఒకరి చావునకు కారణం అయిన అల్లు అర్జున్‌పై పోలీసులు బీఎన్‌ఎస్‌ 118 (1), బీఎన్‌ఎస్‌ 105, రెడ్‌విత్‌ 3/5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

మరోవైపు, అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఆయన తరుపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరగాల్సి ఉండగా.. దానిని న్యాయస్థానం సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.