పుష్ప సినిమా సీన్ రిపీట్.. ఐసర్ వ్యానులో గంజాయి.. అడ్డంగా దొరికిపోయారు..!

గొలుగొండ: పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్లో ఎర్ర చందనం దుంగలను ఐసర్ వ్యానులో తరలించే సీన్ గుర్తుండే ఉంటుంది. ఈ సన్నివేశాన్ని ఇన్ స్ప్రెషన్ గా తీసుకున్నారో ఏంటో గానీ గంజాయిని అచ్చం ఇలానే తరలిస్తున్న ముఠాను నర్సీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పుష్ప సినిమా తరహాలో గంజాయి తరలిస్తూ ముద్దాయిలు అడ్డంగా దొరికిపోయారు. 450 కేజీల గంజాయిని తరలిస్తు్న్న ఐసర్ వ్యానును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితుల అరెస్ట్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం డిఎస్పీ మోహన్ రావు మీడియాకు వెల్లడించారు. నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ, కేడీ పేట ఎస్ఐ తారకేశ్వరరావు, గొలుగొండ ఎస్ఐ రామారావు ఆధ్వర్యంలో భారీగా గంజాయి తరలిస్తున్న నిందితులను అదుపులో తీసుకుని  రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. గంజాయి ముఠా ఆట కట్టించిన పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇటీవల గంజాయిని తరలిస్తూ పట్టుబడుతున్న ఘటనలు చాలానే వెలుగుచూశాయి. భద్రాచలంలో కూడా నవంబర్ లో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి పుణెకు వాహనాల్లో తరలిస్తున్న గంజాయిని  భద్రాచలం RTO చెక్ పోస్ట్  దగ్గర తనిఖీలు చేస్తుండగా పట్టుకున్నారు.

ఏపీ  డొంకరాయి నుంచి మహారాష్ట్రలోని పూణేకు 210 కిలోల గంజాయిని కారులో తరలిస్తుండగా భద్రాచలం ఆర్టీవో చెక్ పోస్ట్ దగ్గర భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహీం ఉన్నిసా బేగం  సిబ్బంది కలిసి నవంబర్ 28న  పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పట్టుబడిన 210 కేజీల గంజాయి విలువ రూ 53 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయితో పాటు ఐదు లక్షల విలువ చేసే కారు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు.