అల్లు అర్జున్కు రెండున్నర గంటలు సినిమా చూపించిన పోలీసులు !

హైదరాబాద్: పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ విచారణ ముగిసింది. చిక్కడపల్లి పోలీసులు దాదాపు రెండున్నర గంటల పాటు బన్నీని విచారించారు. అంతసేపు విచారించినప్పటికీ అల్లు అర్జున్ కొంతమేరనే స్పందించినట్లు తెలిసింది. కొన్ని ప్రశ్నలకు ఈ పుష్ప రాజ్ నుంచి సమాధానమే రాలేదని టాక్. 

సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, ఏసీపీ రమేశ్, ఇన్ స్పెక్టర్ రాజునాయక్ అల్లు అర్జున్ను విచారించారు. న్యాయవాదులతో కలిసి అల్లు అర్జున్ విచారణకు హాజరు కావడం గమనార్హం. అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు అల్లు అర్జున్ను విచారించారు. పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అందులో భాగంగా అల్లు అర్జున్ను సంధ్య థియేటర్ వద్దకు తీసుకెళ్లి అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయంలో పిన్ టూ పిన్ విచారించనున్నారు.

అల్లు అర్జున్‌ను విచారణలో భాగంగా పోలీసులు అడిగిన ప్రశ్నలివే..

1. సంధ్య థియేటర్‌కు వచ్చేటప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారు ?

2. పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు ?

3. పోలీసులు అనుమతి నిరాకరించినట్లు మీకు సమాచారం ఇచ్చారా.. లేదా?

4. తొక్కిసలాటలో రేవతి చనిపోయినట్లు థియేటర్‌లో ఉన్నప్పుడు తెలిసిందా? లేదా?

5. మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు ?

6. రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా ? లేదా?

7. అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు ?

8. మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్‌కు వచ్చారు ?

9. మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు ?

10. ఎంతమంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు ?

11. అభిమానులు, పోలీసుల మీద దాడిచేసిన బౌన్సర్లు ఎవరు ?

12. ఓ మహిళ చనిపోయిందని, మీరు థియేటర్ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారా ? లేదా ?

13. పోలీసులు చెప్పినా.. వెళ్లేందుకు ఎందుకు మొదట నిరాకరించారు ?

14. రేవతి చనిపోయిన విషయాన్ని మీరు మొదట ఎప్పుడు తెలుసుకున్నారు ?

ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనిని పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా ఈవెంట్లకు అల్లు అర్జున్ బౌన్సర్ గా ఆంటోని వెళుతుంటాడు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సమయంలో కూడా ఆంటోని బన్నీకి సెక్యూరిటీగానే ఉన్నాడు.