ఏంటి పుష్ప ఇంత పని చేశావ్.. సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్

  • పుష్ప2 వివాదంతో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు రద్దు!
  • అయోమయంలో భారీ బడ్జెట్​ చిత్రాలు.. తగ్గనున్న కలెక్షన్లు
  • సంక్రాంతి బరిలోకి రాంచరణ్, బాలకృష్ణ, వెంకటేశ్​ మూవీస్​
  • అల్లు అర్జున్​, అరవింద్​ తీరుపై పలువురు నిర్మాతల్లో అసంతృప్తి
  • వివాదం మరింత ముదరకుండా ప్రయత్నాలు

హైదరాబాద్ , వెలుగు: సంక్రాంతికి రిలీజ్ కానున్న తెలుగు సినిమాల నిర్మాతల్లో కొత్త టెన్షన్​ స్టార్టయింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప– 2 బెనిఫిట్ షో తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కొడుకు శ్రీతేజ్ హాస్పిటల్​లో చికిత్స పొందుతుండటంతో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. ఇక నుంచి సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని, టికెట్ రేట్లు కూడా పెంచేది లేదని సీఎం రేవంత్​రెడ్డి తేల్చిచెప్పారు. త్వరలో దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో.. సంక్రాంతి టైమ్​లో అగ్రహీరోల సినిమాలు రిలీజ్​ చేసి, మంచి వసూళ్లు రాబట్టుకొని, బాక్సాఫీస్​ రికార్డులు బద్దలు కొట్టాలనుకుంటున్న నిర్మాతలు అయోమయంలో పడ్డారు.

టాలీవుడ్​కు సంక్రాంతి అంటే గోల్డెన్ టైమ్. ఏటా సంక్రాంతికి ఇద్దరు, ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కావటం ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్నది. పండుగ సెలవులు సుమారు 10 రోజులు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లలో సినిమాలను విడుదల చేసి ఎక్కువ కలెక్టన్స్ సాధిస్తుంటారు. సంక్రాంతికి రిలీజ్ అని మూవీ స్టార్టింగ్ రోజే కొందరు అగ్ర హీరోలు ప్రకటిస్తుంటారు. దీంతో మిగతా హీరోలు వాయిదాలు వేసుకుంటుంటారు. ఈ సంక్రాంతి బరిలో ‘గేమ్​ చేంజర్​’, ‘డాకు మహారాజ్​’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి పలు భారీ చిత్రాలు ఉన్నాయి.

టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ మూవీకి ఇటీవలే తెలంగాణ ఫిల్మ్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ (ఎఫ్ డీ సీ) చైర్మన్​గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు నిర్మాత. సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్​ దీన్ని నిర్మించారు. వాస్తవానికి క్రిస్ మస్ కు రిలీజ్ చేద్దామనుకున్నప్పటికీ పుష్ప మూవీ రిలీజ్ ఉండటంతో సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్ ’ను రిలీజ్ చేస్తున్నారు. ఇక.. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘డాకు మహారాజ్’ మూవీ కూడా జనవరి 12న రిలీజ్​కు రెడీ అవుతున్నది.

దీన్ని సుమారు  రూ. 150 కోట్లతో బడా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. గత మూడేండ్ల నుంచి ప్రతి సంక్రాంతికి బాలకృష్ణ మూవీ రిలీజ్ అవుతున్నది. వరుసగా సినిమాలు వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాయి. ఇక వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపుడి డైరెక్షన్ లో  ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ జనవరిలో రిలీజ్​ కానుంది. ఈ మూవీకి శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అల్లు అర్జున్​ సినిమా పుష్ప వివాదం ఎఫెక్ట్​తో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపును రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం.. ఇలాంటి భారీ సినిమాలకు ఒక రకంగా షాకేనని ఇండస్ట్రీలో చర్చ నడుస్తున్నది. 
 
ఇండస్ట్రీకి నైజాం కలెక్షన్స్ కీలకం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి నైజాం కలెక్షన్స్ ఎంతో కీలకం. ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చినా ఇందులో నైజాం కలెక్షన్స్ ను ప్రత్యేకంగా నిర్మాతలు ప్రకటిస్తుంటారు. రాయలసీమ, సీడెడ్ లో థియేటర్లు ఎక్కువ ఉన్నప్పటికి ఇండస్ట్రీకి హైదరాబాద్ గుండె లాంటిదని అంటుంటారు. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్​ వివాదం ఎఫెక్ట్​.. రాబోయే సినిమాల కలెక్షన్లపై పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.

‘పుష్ప’పై నిర్మాతల ఫైర్​

పుష్ప 2 వివాదంలో అల్లు అర్జున్, అల్లు అరవింద్ తీరుపై ఇండస్ట్రీలో నిర్మాతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి, జైలుకు పంపించిన తర్వాత కూడా తమ తప్పు లేదన్నట్టుగా ఆ ఇద్దరి ప్రవర్తన ఉందని ఇండస్ట్రీలో చర్చ సాగుతున్నది. ఒక్క పూట జైలుకు వెళ్లి వచ్చిన అల్లు అర్జున్​ను పరామర్శించేందుకు ఇండస్ట్రీ మొత్తం క్యూ కట్టి పరామర్శించడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.

మధ్యంతర బెయిల్ లో ఉండి అల్లు అర్జున్​ ప్రెస్ మీట్ పెట్టడం, పోలీసులదే తప్పు అన్నట్లుగా మాట్లాడటంపై పలువురు నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతో వివాదం పెట్టుకుంటే ఇండస్ట్రీకే నష్టమని అంటున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసుతో తిప్పలు ఎదుర్కొన్నామని.. ఆ కేసు మళ్లీ ఓపెన్​ అయితే  ఇండస్ట్రీలోని పెద్ద తలకాయలు బయటకు వస్తాయని చెప్తున్నారు. వివాదాన్ని పరిష్కరించే దిశగా అంతా కలిసి ముందుకు వెళ్లాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.