హైదరాబాద్: పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి అతనిని అదుపులోకి తీసుకున్నారు. పుష్ప-2 సినిమాపై బీభత్సమైన క్రేజ్ ఉన్న సమయంలో అల్లు అర్జున్ థియేటర్కు వెళ్లడం, అభిమానుల అత్యుత్సాహం వల్ల జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ నిండు ప్రాణం పోయింది. ఆమె కొడుకు ఆసుపత్రి పాలయ్యాడు.
పోలీసులు సకాలంలో స్పందించి తొక్కిసలాట జరిగిన వెంటనే ఆ పిల్లాడికి సీపీఆర్ చేయడంతో ప్రాణాలు దక్కాయి. ఆమెకు కూడా సీపీఆర్ చేసినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వెళ్లి ఉండకపోతే ఇదంతా జరిగి ఉండేదే కాదు. ఈ తొక్కిసలాట ఘటనపై బాధితుడు, రేవతి భర్త భాస్కర్ చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ALSO READ | భార్యను ఓదార్చి.. తండ్రికి ధైర్యం చెప్పి.. పోలీస్ స్టేషన్కు వెళ్లిన అల్లు అర్జున్
ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా, సరైన వసతులు కల్పించకుండా, ఎక్కువ మందిని లోపలికి పంపి తమకు సీట్లు లేకుండా చేసి తమను కిందకు నెట్టివేసి తన భార్య రేవతి మరణానికి, తన కొడుకు శ్రీతేజ్ ఆసుపత్రి పాలు అవడానికి కారణం అయిన సంధ్య థియేటర్ యాజమాన్యం, సిబ్బందితో పాటు ఈ తొక్కిసలాటకు కారణం అయిన హీరో అల్లు అర్జున్ మరియు వారి పర్సనల్ సెక్యురిటీపై చట్ట రీత్యా తగిన చర్యలు తీసుకోవాలని రేవతి భర్త భాస్కర్ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు కారణంగానే అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రాథమిక దర్యాప్తులో సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన సందీప్, థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజు, థియేటర్ లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ ఇన్చార్జి గంధకం విజయ చందర్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డిసెంబర్ 5న భాస్కర్ ఈ ఫిర్యాదు చేశాడు. ఈ తొక్కిసలాట ఘటనపై విచారించిన పోలీసులు డిసెంబర్ 9న సంధ్య థియేటర్ మేనేజర్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. శుక్రవారం ఇదే కేసులో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు:
- 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు
- 105 సెక్షన్ నాన్‌బెయిలబుల్ కేసు
- 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం
- BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం