- జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో నాంపల్లి కోర్టు ఎదుట ఫస్ట్ అప్పియరెన్స్
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన అర్జున్
- ఎంఎస్‌జే కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్
- కౌంటర్ దాఖలు చేయాలన్న కోర్టు
- కోర్టు వద్ద100 మంది పోలీసులతో బందోబస్తు
హైదరాబాద్, వెలుగు: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో శుక్రవారం నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ గడువు ముగియడంతో సినీ నటుడు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ఆయన కోర్టుకు వస్తే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఆయన తరఫు లాయర్లు తెలిపారు. శాంతి భద్రతల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అల్లు అర్జున్‌ను ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు కోర్టు ఆమోదం తెలిపింది.
దీంతో అల్లుఅర్జున్ తన ఇంటి వద్ద నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. కాగా, తదుపరి విచారణను జనవరి10వ తేదీకి వాయిదా వేస్తూ.. జడ్జి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ తరుఫు లాయర్లు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్‌జే) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ.. విచారణను సోమవారానికి (ఈ నెల 30)కి వాయిదా వేసింది. ఈ మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌పై 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగగా..రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఎంఎస్‌జే కోర్టులో విడివిగా విచారణ జరిగింది.
అల్లు అర్జున్ వస్తాడని భారీ పోలీస్ బందోబస్తు
పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 13న నాంపల్లి కోర్టు రిమాండ్ చేయగా..హైకోర్టు ఆయనకు 4 వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంది.
దీంతో కోర్టుకు వచ్చేందుకు అల్లు అర్జున్ సిద్ధమయ్యాడు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడిషనల్ డీసీపీ, ముగ్గురు ఏసీపీ, ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు,8 మంది ఎస్‌ఐలు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సహా దాదాపు 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యాయవాదులు, కేసుల హియరింగ్ ఉన్నవారిని మినహా ఇతరులను కోర్టు కాంప్లెక్స్‌లోకి అనుమతించలేదు. అయితే, కోర్టు అనుమతితో అల్లు అర్జున్ వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు.