అయ్యప్ప ప్రసాదంలో.. ‘హలాల్ బెల్లం’ వాడ్తలేం

అయ్యప్ప ప్రసాదంలో.. ‘హలాల్ బెల్లం’ వాడ్తలేం

త్రివేండ్రం: శబరిమల అయ్యప్ప ఆలయంలో ప్రసాదాల తయారీకి హలాల్ బెల్లం వాడుతున్నారన్న ప్రచారాన్ని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఖండించింది. అది పచ్చి అబద్ధమని కేరళ హైకోర్టుకు తెలిపింది. ఆలయంలో ప్రసాదంగా నివేదించే అరవన పాయసం, అప్పం తయారీలో హలాల్ బెల్లం వాడుతున్నారని, దీన్ని తక్షణం ఆపాలని ఎస్జే కుమార్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ ను కేరళ హైకోర్టు గురువారం విచారించింది. ప్రసాదం అమ్మకాలను దెబ్బతీసేందుకే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బోర్డు వాదించింది. మహారాష్ట్రకు చెందిన కంపెనీ నుంచి బెస్ట్ క్వాలిటీ బెల్లాన్ని అన్ని పరీక్షలు చేసి కొంటున్నామని వివరించింది. ‘

‘2019, 2020ల్లో కొన్న బెల్లాన్ని కరోనా వల్ల వాడలేదు. అది మనుషులు తినడానికి పనికిరాదని తేలడంతో పశువుల దాణాగా వేలం వేశాం. 2020లో కొన్న బెల్లం సంచుల్లో ఒకదానిపై హలాల్ సర్టిఫికేషన్ ఉంది. ఎగుమతుల కోసం ఉద్దేశించిన అలాంటి కొన్ని బస్తాలు ఆలయానికి పంపిన బెల్లంలో కలిశాయని సప్లయర్ చెప్పారు. వాటిని ప్రసాదం తయారీలో వాడలేదు” అని తెలిపింది. ఆలయంలో వాడే బెల్లానికి పంపా దగ్గరి ల్యాబ్ లో క్వాలిటీ టెస్టులు చేస్తున్నట్టు కమిషనరేట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ కూడా కోర్టుకు తెలిపింది. దీనిపై సోమవారానికల్లా కౌంటర్ వేయాలని పిటిషనర్ కు కోర్టు సూచించింది.