పనాజీ: గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే 18 ఏండ్లు పైబడిన మహిళలందరికీ నెలకు రూ.వెయ్యి ఆర్థిక సాయం అందజేస్తామని ఆ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం గృహ ఆధార్ స్కీమ్ కింద నెలనెలా ఇస్తున్న సాయాన్ని రూ.1,500 నుంచి రూ.2,500 పెంచుతామని చెప్పారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, ముఖ్యమైన ఉమెన్ ఎంపవర్ మెంట్ ప్రోగ్రామ్ అవుతుందన్నారు. ఆదివారం సౌత్ గోవాలో నిర్వహించిన ఉమెన్ కన్వెన్షన్ లో ఆయన మాట్లాడారు. ‘‘ఎంతోమంది అమ్మాయిలు డబ్బుల్లేక కాలేజీకి వెళ్లలేకపోతున్నారు. మేమిచ్చే రూ.వెయ్యి వాళ్ల చదువుకు ఉపయోగపడతాయి” అని కేజ్రీవాల్ చెప్పారు. కాగా, పంజాబ్ లోనూ ఆప్ ఇదే హామీని ఇచ్చింది. ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
