అడ్వెంచర్ యాక్టివిటీస్‌‌ .. అన్నీ ఒకేచోట

అడ్వెంచర్ యాక్టివిటీస్‌‌, జంగిల్ సఫారి, ట్రెక్కింగ్, నైట్ క్యాంపింగ్ చేసేందుకు ఎక్కడికెక్కడికో వెళ్తుంటారు. కానీ..  ఇవన్నీ మహబూబ్‌‌నగర్‌‌‌‌లోని ఎకో పార్క్‌‌లో ఒకే చోట చేయొచ్చు.  

మహబూబ్‌‌నగర్ జిల్లా శివారులోని  అర్బన్ ఎకో పార్క్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక్కడి అప్పన్నపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌‌లోని 2,087 ఎకరాల్లో ఈ ఎకో పార్క్‌‌ని నిర్మించారు. ఎకో పార్క్ నుంచి అప్పన్నపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌‌లోకి వెళ్లేందుకు ఈ మధ్యే జంగిల్ సఫారీని అందుబాటులోకి తెచ్చారు. ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలో ఉండే గోల్ బంగ్లా వరకు సఫారీ వెహికల్​లో తిప్పుతారు. 

మార్గమధ్యలో చిరుత పులులు, జింకలు, ఎలుగ్గొడ్డులు, పందులు కనిపిస్తాయి. గోల్ బంగ్లా నుంచి వ్యూ పాయింట్ వరకు వెళ్లి, తిరిగి పార్క్‌‌కి చేరుకుంటారు.  ఇందుకు ఒక ట్రిప్‌‌కు రూ.2 వేలు ఛార్జ్ చేస్తారు. రెండు గంటల పాటు సాగే ఈ సఫారీ రైడ్​ ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగ్గంటల వరకు మాత్రమే ఉంటుంది.

నైట్ క్యాంపింగ్

టూరిస్ట్​ల కోసం పార్క్‌‌లో నైట్ క్యాంపింగ్‌‌ ఏర్పాటు చేశారు. ఇందుకు ఒక్కొక్కరికి రూ.1,500 ఛార్జ్ చేస్తారు. ఈ ఛార్జ్‌‌లోనే ఉదయం బ్రేక్‌‌ఫాస్ట్‌‌, మధ్యాహ్నం లంచ్, రాత్రి భోజనం, అడ్వెంచర్ యాక్టివిటీస్, మూడున్నర కిలోమీటర్ల ఎత్తులో ఉండే బాయన్న గుట్ట ట్రెక్కింగ్ చేయిస్తారు.

గార్డెన్లు ప్రత్యేకం

ఎకో పార్క్‌‌లో గార్డెన్లు ఆకట్టుకుంటాయి. బటర్ ఫ్లై గార్డెన్, రోజ్ గార్డెన్, నక్షత్ర వనం, నవగ్రహ వనాలు ఉన్నాయి. కరెన్సీ పార్క్​లో 20 దేశాలకు చెందిన కరెన్సీ గుర్తుల బొమ్మలు ఉంటాయి. చిల్ర్డన్ ప్లే ఏరియాతో పాటు చిన్న పిల్లల కోసం బోటింగ్‌‌ కూడా ఉంది. 

బర్డ్స్ ఎన్‌‌క్లోజర్స్​ 

పార్క్‌‌లో ఎన్‌‌క్లోజర్స్​ ఉన్నాయి. వాటిలో ఆస్ర్టేలియా నుంచి తెచ్చిన చిలుకలు, ఆస్ట్రిచ్ కోళ్లు, తెలుపు, నలుపు, బూడిద రంగుల కుందేళ్లు 20 వరకు ఉన్నాయి.

ఛార్జీలు

పదేండ్లు దాటిన వాళ్లకు పార్క్‌ ఎంట్రీ ఫీజ్30 రూపాయలు. పదేండ్లలోపు పిల్లలకు రూ.15, చిల్డ్రన్ అడ్వెంచర్ కోసం మరో రూ.30 ఛార్జ్ చేస్తారు. అడల్ట్ జిప్ లైన్‌‌కు రూ.70, అడల్ట్ జిప్ సైకిల్ రూ.150 ఛార్జ్‌‌ ఉంటుంది. ఈ పార్క్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రతి సోమవారం పార్క్‌‌కు హాలిడే.

అక్కల ధరణికాంత్‌, మహబూబ్‌నగర్‌‌