న్యూఢిల్లీ : దేశమంతటా.. ముఖ్యంగా మెట్రో సిటీల్లో పిల్లల చదువు, పెంపకం ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏటా కనీసం 10 శాతం అధికమవుతున్నాయి. తల్లిదండ్రులకు రూ.లక్షల్లో జీతం ఉంటే తప్ప పెద్ద ఎడ్యుకేషన్ఇన్స్టిట్యూట్లలో చదవలేని పరిస్థితి ఉంది. మనదేశంలో 3–17 సంవత్సరాల వయస్సు వరకు ఒక ప్రైవేట్ స్కూలులో ఒక పిల్లవాడిని చదివించడానికి రూ. 30 లక్షల దాకా అవుతోంది. కాలేజీ, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పూర్తయ్యే సరికి రూ.కోటి అవుతోంది. చదువు ఖర్చులు ఎక్కువగా ఉండటమే కాదు, అవి ఎప్పుడు ఎలా పెరుగుతాయో కూడా అర్థం కావడం లేదు. పూణేకు చెందిన మయూరి దంపతులు తమ 8 ఏళ్ల కుమార్తెకు 25 ఏళ్లు వచ్చే వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని ప్లాన్ చేశారు.“స్కూలు, ట్యూషన్ ఖర్చులు ప్రతి 2–-5 సంవత్సరాలకు పెరుగుతూ ఉంటాయి. అందుకే ఫీజుల పెంపును భరించడానికి అదనంగా డబ్బును దాచి ఉంచాం ”అని ఈ ఐటీ ఎంప్లాయీ చెప్పారు. 2012–-20 మధ్య భారతదేశంలో ఎడ్యుకేషన్ ఖర్చులు దాదాపు 10-–12శాతం పెరిగాయి. ట్యూషన్ ఫీజు మాత్రమే కాకుండా రవాణా ఫీజులు, పరీక్ష ఫీజులు కూడా కాలానుగుణంగా పెరిగాయి.
వయసు పెరిగేకొద్దీ...
స్టూడెంట్లు ప్రైవేట్ స్కూలులో చేరారని భావించి ఈ లెక్కలు రూపొందించడం జరిగింది. ఢిల్లీ, ముంబై వంటి టైర్-1 నగరాల్లోని చాలా స్కూళ్లు రూ. 25వేల నుంచి రూ. 75వేల వరకు అడ్మిషన్ ఫీజును వసూలు చేస్తాయి. ఇది వరకే అదే స్కూలులో తోబుట్టువు (సిబ్లింగ్) ఉంటే రూ.10వేలు–-20వేలవరకు తగ్గిస్తాయి. ప్రీస్కూల్‌లో నర్సరీ, కిండర్ గార్టెన్ ఉంటాయి. టైర్-I, II నగరాల్లోని మెజారిటీ స్కూళ్లల్లో సగటు ట్యూషన్ ఫీజు స్కూలు బ్రాండ్ ఆధారంగా సంవత్సరానికి రూ. 60 వేల నుంచి -రూ. 1.5 లక్షల మధ్య ఉన్నాయి. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేస్తున్నట్టయితే పిల్లలను డేకేర్ సెంటర్లలో చేర్పిస్తారు. మెట్రో నగరాల్లోని కొన్ని డేకేర్ సెంటర్‌లు నెలకు రూ. ఐదు వేల నుంచి-8,500 వరకు తీసుకుంటున్నాయి. తల్లిదండ్రులు రోజుకు ఐదు గంటల పాటు పిల్లలను డేకేర్ సెంటర్లలో ఉంచితే సంవత్సరానికి రూ. 2 లక్షల వరకు అవుతోంది. ప్రైమరీ స్కూలుకు సంవత్సరానికి ట్యూషన్ ఫీజు రూ. 1.25 లక్షలు–-1.75 లక్షల మధ్య ఉంటుంది. అన్ని ఖర్చులు కలుపుకొని ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం రూ. 5.50 లక్షల వరకు అవుతోంది. మిడిల్ స్కూల్‌కి సగటు వార్షిక ఫీజు సుమారు రూ. 1.6 లక్షల నుంచి - 1.8 లక్షల దాకా ఉంది. అంటే మొత్తం ఖర్చు రూ. 9.5 లక్షలు అవుతోంది. ఇంటర్/12వ తరగతులకు కొన్ని ఇన్స్టిట్యూషన్లు సంవత్సరానికి దాదాపు రూ. నాలుగు వేల నుంచి రూ.ఏడు వేల వరకు పుస్తకాల కోసమే వసూలు చేస్తున్నాయి. నాలుగు సంవత్సరాల హైస్కూల్‌కు రూ.1.8 లక్షల నుండి రూ.2.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. హైస్కూల్ ఎడ్యుకేషన్‌కు మొత్తంగా దాదాపు రూ.9 లక్షలు అవుతోంది. చాలా స్కూల్స్ రవాణా కోసం నగరాన్ని బట్టి నెలకు దాదాపు రూ.1,500–రూ.-2,500 వరకు అదనంగా వసూలు చేస్తాయి. అంటే రవాణా కోసం సంవత్సరానికి రూ. 25వేలు కావాలి. ప్రభుత్వ స్కూలులో చేర్పించాలని నిర్ణయించుకుంటే ఖర్చు సంవత్సరానికి రూ.20వేలు మించదు.
కాలేజీ ఎడ్యుకేషన్
చాలా మంది మధ్యతరగతి తల్లిదండ్రులు ఇప్పుడు కాలేజీ ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాల్సి వస్తోంది. కాలేజీ ఎడ్యుకేషన్ స్కూలు కంటే ఖరీదైనది. కొందరు విదేశాల్లో చదువు కోసం స్కాలర్‌షిప్‌లపై, మరికొందరు లోన్లపై ఆశలు పెట్టుకుంటారు. పూణేకు చెందిన మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ పూనమ్ సంఘీ తన కుమార్తె కాలేజీ ఎడ్యుకేషన్ కోసం స్కాలర్‌షిప్‌పై ఆశలు పెట్టుకున్నారు. పూనమ్, ఆమె భర్త రాకేష్ 15–-18 సంవత్సరాలకు ముందుగానే ప్లాన్ చేశారు. వీళ్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ ఇటీవల ఈక్విటీలో పెట్టుబడి పెట్టారు. కాలేజీ పూర్తయ్యే వరకు రూ. 20 లక్షల వరకు ఖర్చు చేయాలనుకుంటున్నామని పూనమ్ చెప్పారు. భారతదేశంలో కాలేజీ ఎడ్యుకేషన్ ఖర్చు ఏటా 10శాతం పెరుగుతుందని అంచనా. ముంబైకి చెందిన బిందేష్ సాహా భార్య అర్పిత 17 ఏళ్ల కుమారుడు ఆరవ్ ఎకనామిక్స్ పాలిటిక్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం న్యూయార్క్ యూనివర్సిటీకి వెళ్తున్నాడు. ఆరవ్ చదువుకు ఇప్పటికే రూ.కోటి ఖర్చయిందని బిందేష్ చెప్పారు. డబ్బు కోసం వీళ్లు హెచ్డీఎఫ్సీ స్టూడెంట్ లైఫ్ పాలసీతోపాటు లోన్లు తీసుకున్నారు.
ఐఐటీల్లో చదువు సంపన్నులకే సాధ్యం..
భారతదేశంలో ఎలైట్ ఎడ్యుకేషన్ సామాన్యుడికి అందనంత దూరంలో ఉంది. నాలుగు సంవత్సరాల బీటెక్ లేదా మూడేళ్ల బీఎస్సీ కోసం 23 ఐఐటీలు లేదా మరేదైనా ఇతర టాప్ రేటెడ్ ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపు రూ. 4–-20 లక్షలు ఖర్చవుతుంది. జేఈఈ, జేఈఈ (మెయిన్) ఇతర పరీక్షల వంటి ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఖర్చులు రూ. 30 వేల నుంచి నుండి రూ. ఐదు లక్షల వరకు వరకు ఉంటాయి. మనదేశంలో ఇరవై ఐఐఎంలలో లేదా మరేదైనా ప్రైవేట్ వర్సిటీలో చదవాలంటే రూ. ఎనిమిది లక్షల నుంచి -రూ. 23 లక్షల దాకా అవుతోంది. ‘క్యాట్’ లేదా ‘జీమ్యాట్’ వంటి అర్హత పరీక్షల కోచింగ్‌కు అదనపు ఖర్చు ఉంటుంది. ఫైనాన్స్ కోర్సులయిన సీపీఏకు రూ. 3.60 లక్షలు, సీఎంఏకు అయితే రూ.1.20 లక్షల దాకా ఖర్చు అవుతుంది. చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సును పూర్తి చేయడానికి ట్యూటరింగ్ ఫీజు కాకుండానే రూ. 86 వేలు పెట్టాలి.
ప్లాన్ అవసరం
మహమ్మారి లేదా మాంద్యం వంటి ఆప దలను ఊహించడం కష్టం కాబట్టి పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు వీలైనంత త్వరగా ప్లాన్లు సిద్ధం చేయాల ని ఎక్స్పర్టు లు చెబుతున్నారు. "పిల్లల భవిష్యత్తు కోసం ప్లాన్ వేయడానికి ఉత్తమమైన విధానం ఏమిటంటే వాళ్ల ఎడ్యుకేషన్, పెళ్లి వంటి ముఖ్యమైన దశలను లెక్కలోకి తీసుకొని వీలైనంత త్వరగా పెట్టుబడి ప్రారంభించడం. మనం స్వల్ప, దీర్ఘకాలిక టార్గెట్లను పెట్టుకోవాలి. సరైన విధంగా ఇన్వెస్ట్ చేయాలి”అని టీబీఎన్‌జీ క్యాపిటల్ అడ్వైజర్స్ ఫౌండర్ & సీఈఓ తరుణ్ బిరానీ చెప్పారు. పిల్లల సంరక్షణ ఖర్చులు ప్రతి సంవత్సరం కనీసం 10శాతం పెరుగుతాయి. పిల్లలు పుట్టకముందే ఆరు నెలల ఖర్చులకు సరి పడా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. పుట్టా క ఏడాదికి సరిపడ మొత్తాన్ని పక్కనబె ట్టాలి. ఈ మొత్తాల్లో ఎఫ్డీలు, లిక్విడ్ ఫండ్లు, అల్ట్రా షార్ట్‌టర్మ్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలి. కనీసం రూ.పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. హయ్యర్ ఎడ్యు కేషన్, పెళ్లి వంటి లాంగ్‌టర్మ్ గోల్స్ కోసం 85 శాతం మొత్తం ఈక్విటీల్లో, 15 శాతాన్ని డెట్ అసెట్స్‌లో పెట్టవచ్చని బిరానీ అన్నారు. గోల్స్ టైం దగ్గరపడే కొద్దీ ఈక్విటీ పెట్టుబడులను డెట్‌లోకి మార్చాలి.
