స్టాప్ అండ్ స్టార్ట్‌గా కొనసాగుతున్న టెస్ట్ కెరీర్‌ను బలంగా పట్టాలెక్కించాలనుకుంటున్న రోహిత్‌కు మరో అవకాశం..! మిడిలార్డర్‌లో విఫలమైనా.. ఓపెనర్‌గా వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకునేందుకు హిట్‌మ్యాన్ పోరాటం..! లిమిటెడ్ ఓవర్ల మాదిరిగానే సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ తన ముద్ర వేయాలని ఈ ముంబైకర్ ఆరాటం..! ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాపై త్రీ డే ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ విజృంభిస్తాడా? టెస్ట్‌ల్లో స్థానం సుస్థిరం చేసుకుంటాడా? అన్నది ఆసక్తికరంగా మారింది..!!
విజయనగరం: సౌతాఫ్రికాతో మూడు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నాహకంగా జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్, సఫారీలతో అమీతుమీ తేల్చుకోనుంది. చేజారిపోతున్న టెస్ట్ కెరీర్‌ను తిరిగి నిలబెట్టుకునేందుకు ఈసారి రోహిత్ ఓపెనర్‌గా కొత్త అవతారం ఎత్తుతున్నాడు. ఈ మ్యాచ్ నుంచే లాంగ్ ఫార్మాట్‌లో తానెంటో నిరూపించుకోవాలని ఈ ముంబైకర్ చాలా పట్టుదలగా కనిపిస్తున్నాడు. దీంతో అటు మేనేజ్‌మెంట్, ఇటు సెలెక్షన్ కమిటీ ఈ మ్యాచ్‌పై ప్రత్యేక దృష్టి సారించాయి. మయాంక్ అగర్వాల్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. వచ్చే నెల 2 నుంచి మొదలయ్యే టెస్ట్ సిరీస్‌లో టీమిండియా సక్సెస్ కావాలంటే ఈ ఇద్దరి సమన్వయం చాలా అవసరం. కాబట్టి భారీ ఇన్నింగ్స్‌తో తిరుగులేని ఆరంభాన్నివ్వాలని ఈ ద్వయం భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ప్రత్యేకంగా చూడాల్సిన మరో ఆటగాడు ఉమేశ్ యాదవ్. స్టార్ పేసర్ బుమ్రా.. వెన్ను నొప్పితో సిరీస్‌కు దూరంకావడంతో అతని స్థానంలో ఉమేశ్‌కు చాన్స్ దక్కింది. ఈ మ్యాచ్‌లో డుఫ్లెసిస్, మార్క్‌రమ్‌ను నిలువరిస్తేనే రాబోయే సిరీస్‌లో అతను సక్సెస్ అవుతాడు. లేదంటే టెస్ట్ కెరీర్‌పై ఆశలు వదులుకోవాల్సిందే.
ఈసారైనా..
లిమిటెడ్ ఓవర్లలో రోహిత్ గ్రేట్ ప్లేయర్. కానీ టెస్ట్‌లకు వచ్చేసరికి ఘోరంగా విఫలమవుతున్నాడు. అతని నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలని భావించిన మేనేజ్‌మెంట్, సెలెక్షన్ కమిటీ ఓపెనర్‌గా ప్రమోట్ చేసింది. ఇప్పటివరకు 27 టెస్ట్‌లు ఆడిన రోహిత్ సగటు 39.62 మాత్రమే. మూడు సెంచరీలే ఉన్నాయి. ఈ ముంబైకర్ సత్తాకు ఈ గణాంకాలు ఏమాత్రం సరితూగవు. మిడిలార్డర్‌లో రహానె, విహారిని మార్చే చాన్సే లేదు. విండీస్‌పై ఈ ఇద్దరు ఇన్నింగ్స్‌కు మూల స్థంభాల్లా నిలబడ్డారు. కాబట్టి రోహిత్ ఏం చేసినా, ఎలా ఆడినా అది ఓపెనర్‌గానే సాధించాలి. అయితే ఇది అనుకున్నంత సులువు కాకపోవచ్చు. రబడ, ఫిలాండర్, ఎంగిడిలాంటి ప్రపంచ స్థాయి నాణ్యమైన పేసర్లను ఆడటమంటే కత్తిమీద సామే. అయితే విశాఖలో తొలి టెస్ట్‌కు ముందు వీళ్లను ఎదుర్కోవడం రోహిత్‌కు డ్రెస్ రిహార్సల్‌గా మారనుంది. ఇక్కడ నిలబడితే అక్కడ దుమ్మురేపడం ఖాయం. ఒకవేళ విఫలమైతే కుర్రాళ్లు గిల్, ప్రియాంక్ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్‌తో పాటు వెటరన్లు మురళీ విజయ్, ధవన్‌తో పోటీ పడాల్సి ఉంటుంది.
టెక్నిక్ ఇబ్బంది..
గాలిలో ఎక్కువగా స్వింగ్ అవుతూ వచ్చే రెడ్ ఎస్జీ, డూక్స్, కూకబురా బంతులను ఆడటంలో రోహిత్ టెక్నిక్ కొద్దిగా వీక్. దీనిని సరి చేసుకోవడం పెద్ద ఇబ్బంది కాకపోయినా.. మేనేజ్‌మెంట్ ఆలోచనలు మరోలా ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌కు దూకుడు నేర్పిన సెహ్వాగ్‌లా ఆడాలనే ఉద్దేశంతో ఈ హిట్‌మ్యాన్‌కు ఓపెనర్‌గా చాన్సిచ్చారు. ఆరంభంలోనే బౌలర్లను చితక్కొడితే తర్వాత వచ్చే వారిపై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయం. సఫారీలతో మూడు, బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌లు ఆడే రోహిత్ ఓపెనర్‌గా కుదురుకుంటే ఇక తిరుగుండదు. అయితే ఉపఖండంలో లో బౌన్స్ పిచ్‌లపై అతను సక్సెస్ అయినా.. విదేశాల్లో ఎలా ఆడతాడన్నది కూడా చర్చకు దారి తీస్తున్నది. రాబోయే కివీస్ టూర్‌లో పిచ్‌లు కఠినంగా ఉంటాయి. ట్రెంట్ బౌల్ట్ స్వింగ్‌కు రోహిత్ నిలబడతాడా? అన్న ప్రశ్నలు కూడా మొదలవుతాయి. అక్కడి పెర్ఫామెన్స్ బట్టే ఈ ముంబైకర్‌పై ఓ అంచనాకు రావాల్సి ఉంటుంది. ఏదేమైనా.. వన్డేల్లో గ్రేట్ ఓపెనర్‌గా నిలిచిన రోహిత్‌కు మరో ఆరు నెలలు పరీక్ష కాలమే.
