ఈ సండే క్రైస్తవులంతా ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు చేసుకునే స్పెషల్ రెసిపీల్లో ఈస్టర్ కేక్స్ చాలా పాపులర్. కేక్స్ రెగ్యులర్‌గా చేసుకునేవే... ఇంకా ఏవైనా స్పెషల్‌గా ట్రై చేద్దాం అనుకుంటున్నారా! అయితే కేక్స్‌తో పాటు ఫేమస్ రెసిపీస్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. ఆ స్పెషల్స్ మీ కోసం...
కోకోనట్ మ్యాకరూన్స్
కావాల్సినవి : కొబ్బరి పొడి – రెండు కప్పులు
వెన్న – అర కప్పు , చక్కెర పొడి – ముప్పావు కప్పు, కోడిగుడ్లు – ఐదు
కండెన్స్డ్ మిల్క్ – ఒక కప్పు
తయారీ :
ఒక గిన్నెలో వెన్న, చక్కెర పొడి, కోడిగుడ్లు, కండెన్స్డ్ మిల్క్, కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి. ఒక ప్లేట్లో చిన్న స్టీల్ గిన్నెలు పెట్టి, వాటిలో పేపర్ కప్పులు పెట్టాలి. ఆ కప్పుల్లో కలిపి పెట్టుకున్న మిశ్రమం వేయాలి. ఆ తర్వాత ఒక పాన్‌లో స్టాండ్ పెట్టి, దానిపై మ్యాకరూన్ కప్పులున్న ప్లేట్ పెట్టాలి. పాన్‌పై మూత పెట్టి ఇరవై నిమిషాలు ఉడికిస్తే కరకరలాడే మ్యాకరూన్స్ రెడీ.
చాకొలెట్ బ్రౌనీస్
కావాల్సినవి :
కోడిగుడ్లు – మూడు, మైదా – ఒకటింబావు కప్పు
చక్కెర పొడి – ఒక కప్పు, డార్క్ కొకొవా పౌడర్ – మూడు టేబుల్ స్పూన్లు, వెన్న – అర కప్పు
డార్క్ చాకొలెట్ – ఒక కప్పు
తయారీ :
కోడిగుడ్డుకి సన్నటి రంధ్రం చేసి తెల్ల సొన, పచ్చ సొన వేరుచేయాలి. ఒక పాన్‌లో నీళ్లు మరిగించి, అందులో ఖాళీ కోడిగుడ్ల పెంకులు వేయాలి. ఐదునిమిషాలు వేడినీళ్లలో వాటిని కడిగి, ఆరబెట్టాలి. ఆ తర్వాత నెయ్యి పూసి, గాలి చొరబడకుండా ట్రేలో బోర్లించి పెట్టాలి. మైదా, చక్కెర పొడి, డార్క్ కొకొవా పౌడర్ కలిపి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వెన్న వేయాలి. అందులో డార్క్ చాకొలెట్ వేసి బాగా కలపాలి. అందులో మూడు కోడిగుడ్ల పచ్చసొన వేసి కలపాలి. ఇంకో గిన్నెలో తెల్లసొన వేసి గిలక్కొట్టాలి. అందులో కోడిగుడ్ల పచ్చసొన కలిపిన చాకొలెట్ మిశ్రమం వేసి బాగా కలపాలి. తరువాత మైదా పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి. తయారైన ఈ మిశ్రమాన్ని కోడిగుడ్ల పెంకుల్లో పోయాలి. అల్యూమినియం పేపర్‌తో కోడిగుడ్డు మీద ఉన్న రంధ్రం మూసేయాలి. అల్యూమినియం పేపర్ని రౌండ్‌గా చుట్టి ఒక పాన్‌లో పెట్టాలి. ఒక్కో రౌండ్లో ఒక్కో కోడిగుడ్డు పెట్టి ఇరవై నిమిషాలు ఒవెన్‌లో బేక్ చేయాలి.
హాట్ క్రాస్ బన్స్
కావాల్సినవి : పాలు – పావు కప్పు, చక్కెర – ముప్పావు టేబుల్ స్పూన్, ఈస్ట్ పౌడర్ – ఒకటిన్నర టీస్పూన్, ఎండు ద్రాక్ష – అర కప్పు, వెన్న – పావు కప్పు, కోడిగుడ్డు – ఒకటి, ఉప్పు – ఒక టీస్పూన్, మైదా – మూడు కప్పులు, ఆరెంజ్ తొక్క, తేనె – కొంచెం, దాల్చినచెక్క పొడి – అర టీస్పూన్, బేకింగ్ పౌడర్ – పావు టీస్పూన్, నీళ్లు – సరిపడా
తయారీ :
పాలు కాగబెట్టాలి. వాటిలో నుంచి కొన్ని పాలు పక్కకి తీసి, అందులో చక్కెర కలపాలి. తరువాత ఈస్ట్ పౌడర్ వేసి కలిపి మూతపెట్టాలి. కొన్ని పాలలో ఎండుద్రాక్ష నానబెట్టాలి. మరో గిన్నెలో మిగిలిన పాలు పోసి, వెన్న, కోడిగుడ్డు సొన, ఉప్పు, ఈస్ట్ కలిపిన పాలు పోసి బాగా కలపాలి. అందులో మైదా పిండి, ఆరెంజ్ తొక్కల తురుము, దాల్చినచెక్క పొడి, నానబెట్టిన ఎండుద్రాక్షలు వేసి చపాతీ పిండిలా కలిపి మూతపెట్టాలి. అరగంట తరువాత ఈ పిండిని ఓ మాదిరి ఉండలుగా చేయాలి. చిన్న గిన్నెలో చక్కెర కలిపిన పాలు తీసుకుని, తయారుచేసిన ఉండలపై పూయాలి. మరో గిన్నెలో బేకింగ్ పౌడర్, ఉప్పు, మైదా వేసి కలపాలి. అందులో కొన్ని నీళ్లు పోసి పేస్ట్‌లా చేయాలి. దాన్ని ఉండలపై క్రాస్లా పూయాలి. ఆ ఉండల్ని ఒక ప్లేట్లో పెట్టి ఒవెన్‌లో పెట్టాలి. ఒవెన్ లేకపోతే స్టవ్ మీద పాన్ పెట్టి, పాన్ మీద ఉప్పు పరవాలి. దానిపై ఒక గిన్నె పెట్టి, బన్స్ ఉన్న ప్లేట్ పెట్టాలి. పాన్‌మీద మూతపెట్టి దాదాపు అరగంట ఉడికించాలి. బన్స్ రెడీ అయ్యాక, వాటిపై తేనె పూసుకుని తింటే టేస్ట్ బాగుంటుంది.
