కల్వకుర్తిలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

నాగర్​ కర్నూల్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో సీఎం రేవంత్​ రెడ్డి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, కలెక్టర్ ​బాదావత్​సంతోష్​, అడిషనల్​ కలెక్టర్​ సీతారామారావు, అధికారులు మూడు రోజులుగా సీఎం పర్యటనకు ఏర్పాట్లను సమీక్షించారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు హెలీకాప్టర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కల్వకుర్తికి రానున్నారు. తొలుత కల్వకుర్తి మున్సిపల్​ఆఫీస్​ పక్కన జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

అనంతరం హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారిలోని కొట్ర జంక్షన్​ వద్ద కేంద్ర మాజీ మంత్రి దివంగత సూదిని జైపాల్​రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. జిల్లా ఎస్పీ వైభవ్​ గైక్వాడ్, సీనియర్ అధికారులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 20 వేల మంది సీఎం సభకు హాజరవుతారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు. ఈ సభలో కల్వకుర్తి నియోజకవర్గానికి సీఎం రేవంత్​రెడ్డి నిధులు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల తెలిపాయి. పలువురు మంత్రులు, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్​లు కార్యక్రమానికి హాజరుకానున్నారు.