ఢిల్లీకి ఎందుకు? హాట్ టాపిక్గా బీజేపీ ఎమ్మెల్యేల హస్తిన టూర్

* రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై చర్చిస్తారా?
* ‘మహా’ ఫలితాలు రాగానే ఈ భేటీ ఎందుకు?
* పొత్తు అంశాలపై మాట్లాడేందుకు పిలిచారా?
* అంతర్గత విబేధాలపై డిస్కస్ చేస్తారా..?
* ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీల పర్యటనపై ఆసక్తికర చర్చ
* ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశంపై చర్చ

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు హస్తిన బాట పట్టడం హాట్ టాపిక్గా మారింది. అందరినీ ఏక బిగిన ఢిల్లీకి పిలిచి ఏం చర్చించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో వేరొకరిని నియమించాల్సి ఉంది. 

ఈ స్థానం కోసం డీకే అరుణ, రఘునందన్ రావు, ఈటల, అర్వింద్ పోటీపడుతున్నట్టు  ప్రచారంలో ఉంది. అయితే ఎవరిని నియమించాలనే అంశంపై ఏకాభిప్రాయం కోసం వీళ్లను పిలిచి ఉంటారా..? అనే చర్చ కూడా నడుస్తోంది. ఇదిలా ఉండగా.. సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణలో పొత్తుల అంశంపై చర్చించేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పిలిచారా..? అనే చర్చ నడుస్తోంది.

మహారాష్ట్ర ఎన్నికల్లో  సానుకూల ఫలితాలు రావడంతో బీజేపీ అధినాయకత్వం రంగంలోకి దిగడం హాట్ టాపక్ గా మారింది. సంకీర్ణాలతో ముందుకు పోవాలని భావిస్తే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందా? అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉప్పు నిప్పులా మెదిగిలిన రెండు పార్టీలు.. క్రమంగా చేరువవుతున్నాయనే వాదన ఉంది. ఈ విషయాలను చర్చించేందుకు ఢిల్లీకి పిలిచినట్టు కూడా మరో వైపు చర్చ సాగుతోంది. 

రాష్ట్ర బీజేపీలో గత కొంత కాలంగా సమన్వయం కొరవడింది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకొంటున్న కాషాయపార్టీ గాడి తప్పుతోందని పత్రికల్లో, టీవీల్లో కథనాలు వస్తున్నాయి. వాటిని చక్కదిద్దే విషయాన్ని కూడా అధినాయకత్వం మాట్లాడుతుందనే వాదన ఉంది. 

తెలంగాణలో వ్యూహమేంటి..?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి..? ఎలా ముందుకు వెళ్లాలి.. ఎవరిని కలుపుకొని వెళ్లాలి.. ప్లస్ ఏంటి..? మైనస్ ఏంటి..? అనే అంశాపై దిశానిర్దేశం చేసేందుకు పిలిచారనీ అంటున్నారు. ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి..? మిత్రులెవరు..? శత్రులెవరు..? అనే దానిపై ఈ సమావేశంలో అధినాయకత్వం క్లారిటీ ఇస్తుందనే చర్చ ఉంది. 

వార్నింగ్ ఇస్తుందా..?
తెలంగాణ బీజేపీలో లుకలుకలున్నాయనేది బహిరంగ రహస్యం. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయం కొరవడింది. నేతల మధ్య చాలా గ్యాప్ ఉంది. గత కొంత కాలంగా ఎంపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై నివేదికలు తెప్పించుకున్న అధినాయకత్వం స్వయంగా రంగంలోకి దిగిందని తెలుస్తోంది. పార్టీలో క్రమశిక్షణ గాడి తప్పుతుండటంతో అందరినీ కూర్చోబెట్టి క్లాస్ ఇస్తుందని తెలుస్తోంది. గీత దాటిన వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చేందుకు డైరెక్టుగా ప్రధాని నరేంద్ర మోదీయే రంగంలోకి దిగారని తెలుస్తోంది.