PCB: ఇదెక్కడి వింత..! పాక్ సెలక్షన్ బోర్డులో అంపైర్ అలీమ్ దార్

ముల్తాన్ టెస్టులో ఇంగ్లాండ్ పై పాకిస్థాన్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో 556 పరుగుల భారీ స్కోర్ కొట్టినా ఆ జట్టు ఓడిపోవడం బాధాకరం. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక జట్టు తొలి ఇన్నింగ్స్ లో 550 పైగా పరుగులు చేసి ఓడిపోవడం ఇదే తొలిసారి. అంతకముందు బలహీన బంగ్లాదేశ్ తో సొంతగడ్డపై రెండు టెస్టుల సిరీస్ 0-2 తేడాతో  ఓడిపోయింది. పాకిస్థాన్ వరుసగా ఆరు టెస్టుల్లో పరాజయం పాలైంది. 

వరుస ఓటముల నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు జట్టును ప్రక్షాళన చేసే  దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌ మాజీ అంపైర్‌ అలీం దార్‌ను సెలక్షన్‌ కమిటీలో చేర్చి ఆశ్చర్య కర నిర్ణయం తీసుకుంది. మాజీ ఆటగాళ్లు ఆఖిబ్‌ జావెద్‌, అజర్‌ అలీ, అలాగే అనలిస్ట్‌ హసన్‌ చీమా కూడా ఈ కమిటీలో చేరారు. ప్రస్తుతం అసద్‌ షఫీక్‌ కమిటీలో ఉండగా.. మహమూద్‌ యూసఫ్‌ కొన్నాళ్ల క్రితమే ఈ కమిటీ నుంచి రాజీనామా చేశాడు. 

Also Read:- DSPగా బాధ్యతలు స్వీకరించిన సిరాజ్

ఈ కొత్త కమిటీలో ప్రతి సభ్యుడికి ఓటింగ్‌ హక్కులుంటాయని పీసీబీ ప్రకటించింది. హెడ్‌ కోచ్‌ కిరెస్టన్‌, జాసన్‌ గిలిస్పీకి కూడా కమిటీలో స్థానం ఉంటుందా లేదా అనేది ఇంకా వెల్లడించలేదు. అంపైర్ అలీమ్ దార్ క్రికెట్ కు తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. పాకిస్థాన్ లో జరగబోతున్న వన్డే కప్ తర్వాత తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. 1998 అంపైరింగ్ బాధ్యతలు చేపట్టి 56 సంవత్సరాల వయసులో తన 25 ఏళ్ళ అంపైరింగ్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఇప్పటివరకు దార్ 145 టెస్టులు, 231 వన్డేలు, 72 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లకు అంపైరింగ్ చేశాడు.