గాల్లో తేలిపోవడం, నీళ్ల మీద దూసుకెళ్లడం వంటివి సినిమాల్లోనో లేదంటే యానిమేషన్ వీడియోల్లోనో చూసుంటాం. చిన్నప్పుడు చదువుకున్న ‘చందమామ’, ‘బాలమిత్ర’, ‘అరేబియన్ నైట్స్’, వంటి కథల పుస్తకాల్లోనూ ఇలాంటి దృశ్యాలు మస్తు ఉంటాయి. ‘అల్లావుద్దీన్ అద్భుత దీపం’ కథల్లో అల్లావుద్దీన్ మ్యాజిక్ కార్పెట్ మీద వెళ్తుంటాడు. అచ్చం అలాంటి సీన్‌నే రీ–క్రియేట్ చేశాడు దుబాయ్‌కి చెందిన ‘రైజ్ఆర్డై’ అనే యూట్యూబర్. అల్లా ఉద్దీన్లానే తెల్లని, గోల్డ్ కలర్ గౌను వేసుకుని, టోపీ పెట్టుకున్న అతను మ్యాజిక్ కార్పెట్ మీద నిల్చొని సముద్రం నీళ్ల మీద దూసుకెళ్లాడు. అంతేకాదు స్ట్రీట్స్, మార్కెట్ గుండా ఠీవిగా నిల్చొని గాల్లో తేలిపోతున్న అతడిని చూసి అక్కడివాళ్లంతా ‘వావ్’ అంటూ ఆశ్చర్యపోయారు. ఆ వీడియోని ఇప్పటికే లక్షల మందికిపైగా చూశారు. ఈ వీడియో చూసినవాళ్లంతా ‘మోడర్న్ అల్లావుద్దీన్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మ్యాజిక్ కార్పెట్ సీక్రెట్ ఇది
‘‘ పెద్ద సర్ఫింగ్ బోర్డు చుట్టూ పీవీసి పైపులు బిగించాడు. ఆ పైపుల లోపల ఎలక్ట్రానిక్ బోర్డు ఏర్పాటుచేశాడు. తర్వాత దాని మీద కార్పెట్ పరిచాడు. ఇదొక ‘ఇ–ఫాయిల్ బోర్డ్’. అంటే ఎలక్ట్రిక్ ప్రొపెల్లర్ ఉన్న సర్ఫ్‌బోర్డ్” అంటూ తను స్టంట్స్ చేసిన మ్యాజిక్ కార్పెట్ సీక్రెట్ చెప్పు కొచ్చాడు ఈ క్రియేటివ్ యూట్యూబర్. ఈ ఏడాది నవంబర్‌లో ఇతను చేసిన ‘అరేబియన్ నైట్స్’ కథల థీమ్ వీడియోలు కూడా పాపులర్ అయ్యాయి.
