అత్యధిక పన్ను చెల్లింపుదారుగా మరోసారి అక్షయ్ కుమార్

అత్యధిక పన్ను చెల్లింపుదారుగా మరోసారి అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్... అంటే బాలీవుడ్ అత్యంత పేరు, ప్రఖ్యాతలు కలిసి భారీ ఇమేజ్ కలిగి ఉన్న స్టార్ హీరోగానే చాలా మంది తెలుసు. కానీ ఇప్పుడు మరో ఘనతను దక్కించుకొని రికార్డు సృష్టించాడు. బాలీవుడ్ లో అత్యధికంగా ఆదాయం ప‌న్ను చెల్లిస్తున్న హీరోల్లో అక్షయ్ కుమార్ ఒక‌రన్న విషయం తెలిసిందే. అయితే, మ‌రోసారి దేశ‌వ్యాప్తంగా అత్యధిక ఆదాయం ప‌న్ను చెల్లించిన వారిలో అక్షయ్ కుమార్ మొద‌టి స్థానంలో నిలిచినట్టు ఐటీ విభాగం తెలిపింది. అందుకు గానూ ఆయనకు గౌరవంతో కూడిన ఓ హాన‌ర‌రీ స‌ర్టిఫికెట్ ని కూడా ప్రధానం చేసింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అక్షయ్ ని ద్వేషించే వారు.. ఒక్కసారి ఆయన నిజాయతీని గమనించాలని సూచిస్తున్నారు. 

ఐదేళ్లుగా టాప్ లోనే..

బాలీవుడ్‌ లో భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్.. పలు ప్రముఖ కంపెనీలకు కూడా ప్రచార కర్తగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆదాయ పన్ను శాఖ ‘సమ్మాన్ పత్ర’ అవార్డు అందుకోవడం చెప్పుకోదగిన విషయం. గత ఐదేళ్లుగా కూడా ఆయన బాలీవుడ్ నుంచి అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుగా ఉన్నారు. అయితే ఆయన ఆదాయం ఎంత, ఎంత పన్ను చెల్లించారనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.

ఇక అక్షయ్ కుమార్ సినిమాల విషయాల గురించి చెప్పాలంటే.. ఇటీవల ఆయన నటించిన ర‌క్షా బంధ‌న్ వ‌చ్చేనెల 11న థియేట‌ర్లలో విడుద‌ల కానుంది. హిమాంశు శ‌ర్మ, క‌నిక ధిల్లాన్ రాసిన ఈ సినిమా క‌థ‌కు ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శక‌త్వం వ‌హించారు.